AP Elections 2024: పోలింగ్ బూత్‌లో ‘పిన్నెల్లి’ విధ్వంసకాండపై ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు
ABN , Publish Date - May 22 , 2024 | 08:19 AM
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ (AP Election 2024) రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన కలకలం రేపింది.
అమరావతి, ఆంధ్రజ్యోతి మే-22: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ (AP Election 2024) రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన కలకలం రేపింది. పిన్నెల్లి దాష్టీకాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిన్నెల్లిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సీఈఓ, డీజీపీకి సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. కాగా.. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన.. చట్టాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పిన్నెల్లి ఇలా చేయడం సిగ్గుచేటు.
AP Elections 2024: ఏలూరు లోక్‌సభలో గెలిచేదెవరు.. అభ్యర్థుల్లో టెన్షన్.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..!?
అడ్డం దొరికిపోయిన పిన్నెల్లి..!
ఈ ఘటనకు సంబంధించి వెబ్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను కేంద్ర ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఈ మేరకు సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఈసీ నుంచి ఆదేశాలు అందాయి. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. సిట్ రంగంలోకి దిగాక పోలీసులు పిన్నెల్లిపై కేసు పెట్టారా..? అంతకుముందే నమోదు చేశారా..? అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే.. ఈ వీడియో బయటికి రాకముందు మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడా గొడవలు చేయలేదని ఎమ్మెల్యే పిన్నెల్లి శుద్ధపూస కథలు చాలానే చెప్పారు.
AP Elections 2024: గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గెలిచేదెవరు.. కేశినేని చిన్నీ మెజార్టీ ఎంత..?
అసలేం జరిగింది..?
రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా.. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని.. తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరితెగించారు. గ్రామంలోని 202వ నంబర్ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి.. ఈవీఎంను ఎత్తి నేలకేసికొట్టారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంటుపై ఆయన, ఆయన అనుచరులు దాడిచేశారు. అలాగే మరో ఏడు పోలింగ్ కేంద్రాల్లోనూ పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ ఏజెంట్‌పై అదేరోజు బూత్ బయటే గొడ్డలితో దాడి చేశారు. మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు, ఆ మర్నాడు జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని 14న గృహనిర్బంధం చేశారు. కానీ అర్ధరాత్రి వారిరువురూ ఇంటి నుంచి పరారయ్యారు. వారు తప్పించుకుపోతున్నా పోలీసులు చోద్యం చూశారన్న విమర్శలున్నాయి. సదరు పోలీసులపై కూడా నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సిట్ రంగంలోకి దిగినా ఈ వ్యవహారంలో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం అంత సమస్యాత్మకం అయినప్పటికీ ఇద్దరే పోలీసులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. పల్నాడు అల్లర్లపై వేసిన సిట్ ఒక డొల్ల తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Read Latest AP News and Telugu News