Lok Sabha Polls: కాంగ్రెస్ కోటపై కమలం కన్ను
ABN , Publish Date - Apr 08 , 2024 | 03:42 PM
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గెలుపే లక్ష్యం
రెండు లోక్‌సభ స్థానాల్లో పాగా వేసేలా వ్యూహం
గులాబీ వలస నేతలకే అధిష్ఠానం టికెట్లు
బీఆర్‌ఎస్, బీజేపీ ఓటు బ్యాంకు కలిసొస్తుందని ఆశ
కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రణాళిక
నల్లగొండ ఓసీకి, భువనగిరి టికెట్ బీసీకి
బీసీల ఓట్లు గంపగుత్తగా పడేలా ప్రచారం
పారాచూట్లకు టికెట్లివ్వడంపై పార్టీ నేతల నారాజ్
నల్లగొండ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు లోక్‌సభ (Lok Sabha Polls 2024) స్థానాలపై కన్నేసిన కమలదళం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. నల్లగొండ, భువనగిరి రెండు చోట్లా కమలం జెండా ఎగరేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ సంప్రదాయ విధానాలను తోసిరాజని వలస నేతలకే టికెట్లు కేటాయించింది. భువనగిరి నుంచి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, నల్లగొండ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని బరిలో నిలిపింది. ఈ ఇద్దరూ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బలహీనపడ్డ బీఆర్‌ఎ్‌సలో జనాదరణ గల వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేస్తున్నారు.
నల్లగొండపై ప్రత్యేక నజర్
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గులాబీ పార్టీకి ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరిన హుజూర్‌గర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి టికెట్ కేటాయించింది. ఈ చర్యతో బీఆర్‌ఎస్ కేడర్‌ను ఆకర్షించడంతో పాటు, కాంగ్రెస్ వ్యతిరేక, బీఆర్‌ఎస్ ఓటర్లని తమవైపు తిప్పుకోవడమే లక్ష్యమని తెలుస్తోంది. ఈ నియోజకవర్గ పరిధిలోని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ తేరా చిన్నపరెడ్డిని కూడా ఇటీవల పార్టీలోకి తీసుకొచ్చారు. దీని ద్వారా బలమైన ఓటు బ్యాంక్ తమ వైపు వస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు. అలాగే మరికొందరు మాజీ ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ అధిష్ఠానం చర్చలు చేస్తోంది. దీనికితోడు బీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నేతలని పార్టీలో చేర్చుకుంటూ పార్టీ కేడర్‌ను పెంచుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసొచ్చేనా..?
భువనగిరిలో బలమైన పోటీ
భువనగిరి లోక్‌సభ స్థానంపై ఆశలు పెంచుకున్న బీజేపీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో పాటు బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌కి టికెట్ కేటాయించింది. దీని ద్వారా ఈ స్థానంలో బలమైన పోటీకి తెర లేపింది. అయితే ఈ స్థానంలో బీఆర్‌ఎస్ సైతం బీసీ నేత క్యామ మల్లేశ్‌కు టికెట్‌ను కేటాయించింది. ఈ నేపథ్యంలో బీసీ ఓటర్లని గంపగుత్తగా తమవైపు తిప్పుకోవాలనే బీజేపీ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. అలాగే అధికార కాంగ్రెస్ కూడా విస్తృత ప్రజాసంబంధాలున్న పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. కాంగ్రె్‌సకు ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఈ ఎమ్మెల్యేలందరూ గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలు సాధించారు. దీంతో బీజేపీ ఓటర్లను తమ వైపు ఎలా తిప్పుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఈసారి ఖాతా తెరవాలనే బీజేపీ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో మరీ.