Share News

YS Sharmila: కాంగ్రెస్‌లోకి ష‌ర్మిల‌.. ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఏమన్నారంటే..?

ABN , Publish Date - Jan 01 , 2024 | 04:11 PM

వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ ( AP Congress ) పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు కూడా షర్మిలని పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

YS Sharmila: కాంగ్రెస్‌లోకి ష‌ర్మిల‌.. ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఏమన్నారంటే..?

అంబేద్కర్ కోనసీమ జిల్లా (అమలాపురం): వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిలని పార్టీలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలతో కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరుతుండడంపై ఆయన క్యాడర్‌కి చెప్పినట్లు సమాచారం.

‘‘వైఎస్ షర్మిల ( YS Sharmila ) త్వరలో ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పారు. వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాకు టచ్‌లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లోనూ ఇండియా అలయన్స్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ( Congress party ) పోటీ చేస్తుంది. ఈనెల 14వ తేదీ నుంచి రాహుల్ గాంధీ మరో యాత్రకి సిద్ధమయ్యారు. త్వరలో చేపట్టబోయే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ ప్రియాంకగాంధీతో పాటు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు రానున్నారు’’ అని గిడుగు రుద్రరాజు తెలిపారు.


ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలకపాత్ర పోషించనున్నారా..?

కాగా.. గతంలో వైసీపీ ( YCP ) అధికారంలోకి రావడంలో షర్మిల కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) జైలుకి వెళ్లిన సందర్భంలో షర్మిల వైసీపీకి పెద్దదిక్కుగా ఉండి పార్టీని తన భుజస్కందలపై మోసిన విషయం తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే మరలా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదు. దీనికితోడు జగన్ వైఖరిపై ఇప్పటికే ఆ పార్టీలోని నేతలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్న సందర్భాలు ఉన్నాయి. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరితే వీరంతా హస్తం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదు. అదేగనుక జరిగితే జగన్మోహన్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో గడ్డుకాలమేనని రాజకీయ వ్యూహకర్తలు చెబుతున్నారు.

Updated Date - Jan 02 , 2024 | 02:50 PM