Share News

Viral Video: ముంబయి లోకల్ రైలులోకి శునకం.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు..

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:36 PM

మనుషులకు పెంపుడు జంతువులకు మధ్య ఉండే సంబంధం ప్రత్యేకమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను పెంచుకునే వారు వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఇంట్లో తమతోపాటే ఉంచుకుంటారు.

Viral Video: ముంబయి లోకల్ రైలులోకి శునకం.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు..

ఇంటర్నెట్ డెస్క్: మనుషులకు పెంపుడు జంతువులకు మధ్య ఉండే సంబంధం ప్రత్యేకమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను పెంచుకునే వారు వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఇంట్లో తమతోపాటే ఉంచుకుంటారు. పెంపుడు జంతువులకు చిన్న గాయమైనా ఏడ్చేస్తుంటారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేకమైన ఆహారం సహా ఆలనా, పాలనా చూస్తుంటారు. అలాగే తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి వాహనాల్లో వివిధ ప్రదేశాలకు తిప్పుతుంటారు. అయితే జంతువులకు ప్రవేశం లేని కొన్ని ప్రత్యేకమైన పబ్లిక్ ప్రదేశాలకు వాటిని తీసుకెళ్లినప్పుడు సమస్యలు తలెత్తుతాయి.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి ముంబయిలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన పెంపుడు కుక్కను ఏకంగా ముంబయి లోకల్ ట్రైన్‌లోకి తీసుకెళ్లింది. రైల్లో శునకాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెంపుడు జంతువును తీసుకురావడంపై వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహిళ తన శరీర ముందు భాగంలో పెద్ద సంచిని తగిలించుకుంది. దాంట్లో చిన్న పిల్లలను పెట్టినట్లు తన పెంపుడు కుక్కను కూర్చోపెట్టింది. అనంతరం టికెట్ తీసుకుని రైలు ఎక్కింది. మెుదట ఆమెను చూసిన ప్రయాణికులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే కుక్క మెురగడంతో ఒక్కసారిగా వారంతా ఉలిక్కిపడ్డారు. శబ్దం ఎక్కడ్నుంచి వస్తోందా అంటూ చుట్టూ పరిశీలించి షాక్‌కు గురయ్యారు.


అయితే ఆ కుక్క తల మాత్రమే తనిపిస్తూ మిగితా భాగం మెుత్తం సంచిలోనే ఉండేలా ఆమె దాన్ని కూర్చోపెట్టింది. దాన్ని చూసిన తోటి ప్రయాణికులంతా కాసేపు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం అది స్నేహపూర్వకంగానే ఉండడంతో దాని తల నిమరడం మెుదలుపెట్టారు. దీంతో అది కూడా హాయిగా సంచిలోనే కూర్చుని ఉండిపోయింది. ఎవరిపైనా ఎలాంటి దాడీ చేయలేదు. ఓ చిన్నారి శునకం తల నిమురుతూ తెగ సంతోష పడింది. దాన్ని తాకుతూ ఆనందం వ్యక్తం చేసింది. కుక్క వెంట్రుకలు చాలా మెత్తగా ఉండడంతో చుట్టుపక్కల వారంతా తాకేందుకు ఇష్టపడ్డారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8లక్షల మంది వీక్షించారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.


అయితే కుక్కను రైలులోకి తీసుకురావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎంత పెంపుడు జంతువైనా సరే వాటిని నమ్మకూడదని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఒకవేళ ఎవరిపైనైనా అది దాడి చేస్తే పరిస్థితి ఏంటని మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై, పూణేలలో ప్రజా రవాణా సమాచారం యాప్ ఎమ్ ఇండికేటర్‌లోనూ లోకల్ రైల్వేస్టేషన్లు, లోకల్ రైళ్లల్లోకి పెంపుడు జంతువులను తీసుకురాకూడదనే నిబంధనను గుర్తు చేస్తున్నారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వాటిని ప్రయాణించడానికి అనుమతిస్తుందని చెప్తున్నారు. ఆ సమయంలోనూ స్టేషన్ రిజర్వేషన్ అధికారికి లేఖ రాయాలని, ప్రైవేట్ క్యాబిన్ లేదా కూపేని అభ్యర్థించాలని అంటున్నారు. ఇలా పెంపుడు జంతువులను రైలులోకి తేస్తే తోటి ప్రయాణికులకు అది అసౌకర్యంగా, భయానికి గురి చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వీడియో వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. "ముంబయి లోకల్ రైళ్లలోకి కుక్కలను ఎప్పట్నుంచి అనుమతిస్తున్నారని కొందరు, నిజమైన తల్లిదండ్రులు తమ పిల్లలతోపాటే పెంపుడు జంతువులనూ సొంత బిడ్డల్లా చూసుకుంటారని మరికొందరూ, కుక్కతో చిన్నారి ఆడుకోవడం భలే అనిపిస్తోందని ఇంకొందరూ, కుక్క అంత సేపు సంచిలో ఉండడం వల్ల దానికి తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉందని మరికొందరూ" వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Oct 14 , 2024 | 05:43 PM