Share News

Bandi Sanjay: రాష్ట్రంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర..

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:30 AM

రాష్ట్రంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే జీవో 29 జారీ అయ్యిందని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణ చేశారు.

Bandi Sanjay: రాష్ట్రంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర..

  • దాంట్లో భాగంగానే జీవో 29 జారీ

  • గ్రూప్‌ 1 పరీక్ష రద్దు కావాలనటం లేదు

  • అభ్యర్థులు రీషెడ్యూల్‌నే కోరుకుంటున్నారు

  • లాఠీచార్జిలో పోలీసులు గర్భిణినీ కొట్టారు

  • కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సంజయ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే జీవో 29 జారీ అయ్యిందని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఉంచుతారా? రద్దు చేస్తారా? అన్నదానిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-1 పరీక్షను నిజాయితీగా నిర్వహించాలన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. శనివారం గ్రూప్‌-1 అభ్యర్థులు హైదరాబాద్‌లో నిర్వహించిన చలో సచివాలయం ముట్టడి ర్యాలీలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు ఉద్రిక్తత మధ్య జరిగిన ర్యాలీలో బండి సంజయ్‌ని పోలీసులు అదుపులో తీసుకొని.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అక్కడే సంజయ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


గ్రూప్‌-1 పరీక్ష రద్దు కావాలని అభ్యర్థులెవరూ కోరుకోవడం లేదని, రీ షెడ్యూల్‌ చేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు. ‘రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు టెన్షన్‌లో ఉన్నరు. వారు పరీక్ష రాసే పరిస్థితిలో లేరు. హైకోర్టులో 22 కేసులున్నయి. తీరా పరీక్ష రాసిన తర్వాత కోర్టు తీర్పు మరోలా వస్తే తమ కష్టం వృథా అవుతుందన్నదే అభ్యర్థుల ఆందోళన. భవిష్యత్తులో న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే.. పరీక్షను రీషెడ్యూల్‌ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు’ అని బండి సంజయ్‌ వివరించారు.


సోనియాగాంధీ జన్మదినం తెలంగాణ నిరుద్యోగ యువతకు బలిదినం కాబోతోందని, ఆమె జన్మదినం వరకు కాంగ్రెస్‌ నాయకులు ఎంతమంది నిరుద్యోగులను బలి తీసుకుంటారోనని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థుల మీద పోలీసులు జరిపిన లాఠీచార్జిపై రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు హాస్టళ్లలోకి చొరబడి తమతో అరాచకంగా వ్యవహరించారని మహిళా అభ్యర్థులు తెలిపారని బండి సంజయ్‌ వెల్లడించారు. గర్భిణిని కూడా పోలీసులు కొట్టారన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


  • నన్ను అరెస్టు చేసే దమ్ము ఎవరికి ఉంది?

చలో సెక్రటేరియట్‌ ర్యాలీ సందర్భంగా తనను పోలీసులు అరెస్టు చేసినట్లు టీవీ చానళ్లలో వచ్చిన కథనాలపై కేంద్ర మంత్రి స్పందించారు. ‘నన్ను అరెస్టు చేసే దమ్ము ఇక్కడ ఎవరికి ఉంది?’ అని పేర్కొన్నారు. తనను అరెస్టు చేయలేదని, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారన్నారు. కాగా, నిరుద్యోగుల ఆందోళనను విచ్ఛిన్నం చేసేందుకు బీఆర్‌ఎస్‌ భారీ కుట్ర పన్నిందని ఆరోపించారు. నిరుద్యోగులకు అండగా బీజేపీ నిర్వహించిన ర్యాలీలోకి బీఆర్‌ఎస్‌.. పథకం ప్రకారం చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించిందన్నారు.


అయితే, నిరుద్యోగులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. గ్రూప్‌-1 వివాదంపై చర్చ కోసం సీఎం రేవంత్‌ తనకు ఫోన్‌ చేశారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని బండి సంజయ్‌ తెలిపారు. చర్చలకు ఎవరూ పిలువలేదన్నారు. గ్రూప్‌-1 అభ్యర్థులు ఒకరిద్దరు ముందుకు వస్తే, అధికారులతో మాట్లాడిస్తామని అధికారులు తనకు తెలియజేశారన్నారు. దీని గురించి అక్కడే ఉన్న అభ్యర్థులకు చెబితే.. చర్చలు అవసరం లేదని, పరీక్షను రీషెడ్యూల్‌ చేయాలని, జీవో 29 రద్దు చేయాలని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు.


  • కేటీఆర్‌ యూజ్‌లెస్‌ ఫెలో

పేపర్‌ లీకేజీలు చేయడం తప్ప, గ్రూప్‌-1 గురించి ఏం తెలుసంటూ కేటీఆర్‌ తన మీద చేసిన విమర్శపై బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. ‘ఫాల్తు రాజకీయాలు చేస్తే రోడ్లపై ఉరికిచ్చి కొడతరు. ఇంకా మీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? యూజ్‌లెస్‌ ఫెలో.. పిచ్చివాగుడు వాగితే రాళ్లతో కొడతరు.. మీ భాష, అహంకారం చూసే మీ అయ్య రెస్ట్‌ తీసుకుంటున్నరు. థూ.. నీ బతుకేంది అని మీ పార్టీ క్యాడరే ఛీత్కరించుకుంటున్నరు. మీదో బతుకా? మీరో మనిషా? మీదో మనిషి పుట్టుకా?’ అని ధ్వజమెత్తారు.


‘మీరు నా గురించి మాట్లాడుతారా? మీ చీకటి బతుకేందో మాకు తెల్వదా? మీరు, రేవంత్‌ ఒక్కటి కాదా? డ్రగ్స్‌ కేసు, మీ అయ్య పేరు ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? మరోసారి నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మీ చీకటి బతుకులు బయటపెడతా’ నంటూ కేటీఆర్‌ను హెచ్చరించారు. ‘మీరు డ్రగ్స్‌ తీసుకోలేదని, నేను పేపర్‌ లీక్‌ చేశానని మీరు, మీ అయ్య, మీ కుటుంబ సభ్యులు ఏ గుడికి వస్తారో వచ్చి ప్రమాణం చేయండి’ అని కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. వారు అలా చేస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, కేటీఆర్‌కు సెల్యూట్‌ చేసి క్షమాపణలు చెబుతానని ప్రకటించారు.

Updated Date - Oct 20 , 2024 | 03:30 AM