CM Revanth Reddy: శంషాబాద్‌లో హెల్త్ హబ్!
ABN , Publish Date - Jun 23 , 2024 | 03:21 AM
ప్రపంచ నలు మూలల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనే భరోసా కల్పించే విధంగా హైదరాబాద్‌లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
విమానాశ్రయం వద్ద 500-1000 ఎకరాల్లో ఏర్పాటు
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చేవారికి
అన్ని రకాల వ్యాధుల చికిత్సకు భరోసా
ప్రపంచ స్థాయి ఆస్పత్రులకు హబ్‌లో చోటు
బసవతారకం ఆస్పత్రికీ అందులో అవకాశం
అభివృద్ధిలో బాబుతో పోటీపడే చాన్స్ వచ్చింది
ఇక 12 కాదు 18 గంటలు పని చేయాల్సిందే
తెలుగు రాష్ట్రాలు అందరికీ ఆదర్శం కావాలి
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ నలు మూలల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనే భరోసా కల్పించే విధంగా హైదరాబాద్‌లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో 500 నుంచి వెయ్యి ఎకరాల్లో అన్ని సదుపాయలతో ఈ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆడిటోరియంలో ఆస్పత్రి 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందించే విధంగా ఆధునిక సంపత్తితో హెల్త్ టూరిజం హబ్ ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
ఏ జబ్బుకైనా హైదరాబాద్ వెళ్లితే వైద్యం దొరుకుతుందనే నమ్మకం కల్పించేలా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచంలో పేరు గాంచిన వైద్య సంస్థలకు ఇక్కడ అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో బసవతారకం ఆసుపత్రికి కూడా కచ్చితంగా చోటు ఉంటుందని చెప్పారు. ఆటలో రాణించాలంటే నైపుణ్యం ఉన్న నాయకుడితో పోటీ పడటం అవసరమని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు తనకు అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబుతో పోటీ పడి పని చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా రోజుకు 12 గంటలు కష్టపడదామని సిద్ధమపడ్డానని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇక ఆయన లాగే 18 గంటలుకష్టపడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇక రాష్ట్రంలో మంత్రులు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఆదర్శంగా తయారు కావాలన్నదే తమ ఆశయమని చెప్పారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: బాలకృష్ణ
పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు బసవతారకం ఆస్పత్రిలో అమలవుతున్న తీరు చూసి ఆయన ప్రతి ఒక్కరిని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ తన కుటుంబానికి రాజకీయ, సంక్షేమ వారసత్వాన్ని ఇచ్చారని, ఆ కుటుంబంలోని మూడో తరం దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. బాలకృష్ణ మాట్లాడుతూ, అడిగిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ల్యాండ్ లీజును పొడిగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలన్నారు. ఆస్పత్రి మీద నమ్మకంతో ప్రభుత్వాలు తమకు సాయం చేస్తున్నాయని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా పని చేస్తామని చెప్పారు.
ఆస్పత్రి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎందరో దాతలు సహాయ సహకారాలు అందించారన్నారు. త్వరలోనే సేవలను మరింత ఎక్కువ మందికి చేర్చడానికి విస్తరిస్తామని చెప్పారు. సీఈవో డాక్టర్ కృష్ణయ్య, ట్రస్టు బోర్డు సభ్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నామా నాగేశ్వరరావు, ఎం.భరత్, జేఎ్‌సఆర్ ప్రసాద్, డైరెక్టర్ టీఎ్‌స.రావు పాల్గొన్నారు. ఆస్పత్రి దాతలైన ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, దివ్య శక్తి ఇండియా, అంకుర్, ఐవోసీ, జనచైతన్య హౌసింగ్, టయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా లిమిటెడ్, క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ లిమిటెడ్, లియోపిలిజేషన్ సిస్టం ఇండియా లిమిటెడ్, కోర్ కార్బన్ లిమిటెడ్ ప్రతినిధులను మెమెంటోలతో సత్కరించారు.