Share News

CM Revanth Reddy: ఆషాఢంలోపే విస్తరణ!

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:00 AM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

CM Revanth Reddy: ఆషాఢంలోపే విస్తరణ!

  • మంత్రివర్గంలో మరో నలుగురికి చాన్స్‌

  • రేసులో సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు

  • ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్‌ చర్చలు

  • రెండు మూడు బెర్తులు పెండింగ్‌లోనే!

  • విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్‌, నామినేటెడ్‌ పోస్టులు

  • పీసీసీ అధ్యక్ష పదవికి నలుగురు నేతల పోటీ

  • ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశావహులు

  • కేంద్రం-రాష్ట్రం మధ్య వారధిగా ఉంటా

  • తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి

  • తెలంగాణ భవన్‌లో పదవీ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌ ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. మంగళవారం ఆయన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపిన రేవంత్‌రెడ్డి.. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తొలుత మంత్రివర్గ విస్తరణ, తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాతే నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై దృష్టి సారించనున్నారు. జూలై 7న ఆషాఢ మాసం ప్రారంభమవుతున్నందున.. ఆలోపే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపడతారని భావిస్తున్నారు.


రెండు మూడు పదవులు పెండింగ్‌లో..

మంత్రివర్గంలో ఆరుగురిని చేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నలుగురికే అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఎడ్మ బొజ్జును మంత్రివర్గంలోకి తీసుకోవడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే నివసిస్తున్న ఎడ్మ బొజ్జుకు అవకాశం కల్పించి, ఒక సంకేతాన్ని ఇద్దామన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రేమ్‌సాగర్‌రావు పేరును డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రతిపాదిస్తున్నారు.


ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. ఇక పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాలు సమాచారం. డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలు, ముస్లింకు ఒక బెర్తు కేటాయించాల్సి ఉండడం, హైదరాబాద్‌ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నందున.. రెండు నుంచి మూడు బెర్తులు పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.


నామినేటెడ్‌ పదవులు కూడా..

రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులకు 37 మందిని ఎంపిక చేసినప్పటికీ లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వారిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇద్దరు, వరంగల్‌ జిల్లాలో ఒకరిపై మంత్రుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఉత్తర్వుల జారీలో ఆలస్యం అవుతోంది. వీరి నియామకాలపైనా అధిష్ఠానంతో జరిపిన చర్చల్లో స్పష్టత వచ్చిందని, కొద్ది రోజుల్లోనే 37 నామినేటెడ్‌ పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


పీసీసీ అధ్యక్ష రేసులో నలుగురు?

ఇక పీసీసీ అఽధ్యక్ష పదవికి ముగ్గురు బీసీలు, ఒక మాదిగ నేత రేసులో ఉన్నట్లు తెలిసింది. బీసీ విభాగంలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, మాదిగ వర్గానికి చెందిన సంపత్‌ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్‌ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పలువురు నేతలు రాజధానికి చేరుకున్నారు. యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామ్మోహన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్‌, బల్మూరి వెంకట్‌, రామచంద్ర నాయక్‌, మధుయాష్కీ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా బుధవారం ఢిల్లీ చేరుకుని సోనియాగాంధీని కలిశారు. మర్యాదపూర్వకంగా సోనియాను కలిసినట్లు చెప్పిన ఉత్తమ్‌.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించినందుకు, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ గురుతర బాధ్యతలు స్పీకరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సోనియా ఆరా తీశారని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ తదితరులను గురువారం కలుసుకుంటానని తెలిపారు.

Updated Date - Jun 27 , 2024 | 03:00 AM