Share News

Operation Akarsh: మరోసారి ఆకర్ష.. ఆకర్ష!

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:06 AM

బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారా?

Operation Akarsh: మరోసారి ఆకర్ష.. ఆకర్ష!
Congress

  • కాంగ్రెస్‌లోకి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు

  • సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు

  • బీజేపీతో బీఆర్‌ఎస్‌ నేతలు టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం

  • కొందరు నాయకులకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చే అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారా? జీహెచ్‌ఎంసీ పరిధిలోని అరడజను మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం.. హైదరాబాద్‌కు తిరిగి రాగానే మరో విడత చేరికలుంటాయా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. వాస్తవానికి సీపీఐ ఎమ్మెల్యేతో కలిపి 65 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కాలం నిలవబోదంటూ కేసీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసిన సంగతి తెలిసిందే.


ఇందులో భాగంగానే దానం నాగేందర్‌ మొదలుకుని పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రె్‌సలో చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభా పక్షం ఏర్పాటు చేయించి బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేయించుకున్న తీరుగానే.. బీఆర్‌ఎ్‌సకు చెందిన 26మంది ఎమ్మెల్యేలతో శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేయించి సీఎల్పీలో విలీనం చేయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారం జరిగింది. బడ్జెట్‌ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్‌రెడ్డి .. ఆ దిశగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులూ జరిపారు. కొంత మందితో ముఖాముఖి సమావేశమై హామీలూ ఇచ్చారు. కాంగ్రె్‌సకు ప్రాతినిధ్యం లేని గ్రేటర్‌ హైదరాబాద్‌, శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.


ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. వీరితోపాటు గ్రేటర్‌ పరిధిలోని మరో అరడజను మంది ఎమ్మెల్యేల చేరికకూ అంతా సిద్ధమైనా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆ ప్రక్రియకు విరామం ఇచ్చారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, పాలనాపరమైన నిర్ణయాలను బడ్జెట్‌ సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి.. చేరికలను పెండింగ్‌లో పెట్టారు.


అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే, బీజేపీ పెద్దలతో బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరందుకోవడంతో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మరోమారు పదును పెట్టాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక.. చేరికల ప్రక్రియ పునఃప్రారంభమవుతుందని, గ్రేటర్‌ పరిధిలోని అరడజను మంది ఎమ్మెల్యేలూ చేరే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.


  • ఇస్తే.. కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టులే

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వబోమంటూ సీఎం రేవంత్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కీలక కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టులను ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి మంత్రి పదవి ఇస్తామంటే.. తమతోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలనూ తీసుకువచ్చేందుకు ఒకరిద్దరు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కానీ, విధాన పరంగా పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని పేర్కొంటున్నాయి.


అయితే, పార్టీలో చేరే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపేందుకు కీలకమైన కార్పొరేషన్‌ పదవులు ఆఫర్‌ చేసే యోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 తర్వాత టీపీసీసీ కార్యవర్గం, నామినేటెడ్‌ పదవుల భర్తీపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంలోనే కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్‌ పదవులు ఇచ్చే అంశంపైనా అధిష్ఠానంతో ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Aug 13 , 2024 | 06:51 AM