Share News

Hyderabad: ఫిరాయింపు పునాదులు కేసీఆర్‌వే..

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:01 AM

‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్‌ తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుంది. కేసీఆర్‌కు సిగ్గుతోపాటు మతి కూడా తప్పింది. అసలు ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్‌ కాదా?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తీసుకున్నారని గుర్తు చేశారు.

Hyderabad: ఫిరాయింపు పునాదులు కేసీఆర్‌వే..

  • ఆయనకు సిగ్గుతోపాటు మతి కూడా తప్పింది

  • క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలి

  • ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే వదిలేయాలా!?

  • లోక్‌సభ ఫలితాలతోనూ కేసీఆర్‌కు కనువిప్పు కలగలేదు

  • విద్యుత్తు కమిషన్‌ వేయాలని అడిగిందే జగదీశ్‌ రెడ్డి

  • విచారణకు ఇప్పుడు కేసీఆర్‌ను పిలవడంతో విమర్శలు

  • గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత

  • కేసులు తెలంగాణలో ఇప్పటి వరకూ లేవు

  • పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడం

  • తెలంగాణ అభివృద్ధిలో అలసత్వం ప్రదర్శించం

  • క్యాబినెట్‌ విస్తరణపై అసలు చర్చలు జరగలేదు

  • పీసీసీ చీఫ్‌గా సమర్థుడిని నియమించాలని కోరా

  • కాంగ్రె్‌సకు నష్టం చేయాలని చూసిన వారికి

  • జీవన్‌ రెడ్డి అవకాశం ఇవ్వలేదు: సీఎం రేవంత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్‌ తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుంది. కేసీఆర్‌కు సిగ్గుతోపాటు మతి కూడా తప్పింది. అసలు ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్‌ కాదా?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తీసుకున్నారని గుర్తు చేశారు. తాను చేసిన తప్పులకు క్షమించాలంటూ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడించులు అరిగేలా నేలకు రాయాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజులు కూడా మనుగడ సాగించదని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ అన్నారు. దానికి బీజేపీ వంతపాడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీలు రోడ్లపై రంకెలేస్తే గాలికి వదిలేయాలా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.


అసెంబ్లీ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి 16 శాతానికి పడిపోయిందని, మొత్తం 17 సీట్లలోనూ ఓడిపోవడమే కాకుండా 8 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, 14 స్థానాల్లో మూడో స్థానానికి పడిపోయిందని, అయినా, కేసీఆర్‌కు కనువిప్పు కలగలేదని దుయ్యబట్టారు. పైగా, ప్రజలదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘కేవలం కాంగ్రె్‌సను ఓడించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు తమ ఓట్లను బీజేపీకి గంపగుత్తగా వేశారు. లేకపోతే, కేటీఆర్‌ నియోజకవర్గం సిరిసిల్లలో బీజేపీకి ఫస్టు ప్లేసు వస్తుందా!? సిద్దిపేటలో బీజేపీ, బీఆర్‌ఎ్‌సకు సమానంగా ఓట్లు వస్తాయా? బీఆర్‌ఎస్‌ కంచుకోట మెదక్‌లో బీజేపీకి మెజారిటీ వస్తుందా!?’’ అని నిలదీశారు. కేసీఆర్‌కు ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. నిన్నటి వరకూ గేటు దగ్గరకు కూడా రానివ్వని ఎమ్మెల్యేలను ఇప్పుడు పిలిచి భోజనాలు పెట్టే పరిస్థితి కేసీఆర్‌కు తలెత్తిందని, తలుపులు మూసి కాళ్లు పట్టకుంటుండో, కడుపులో తలకాయ పెడుతుండో తనకు తెలియదని ఎద్దేవా చేశారు.


‘‘ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రమ్మన్నా రాడు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సైతం రాడు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటాడు. దేశంలో ఎక్కడైనా ఈ సంప్రదాయం ఉందా? గత పదేళ్లలో ఎప్పుడైనా మమ్మల్ని పిలిచాడా? పదేళ్లు సీఎంగా పని చేసినందున సముచిత గౌరవంతో ఆహ్వానించాం. కేసీఆర్‌కు ఉద్యమ స్ఫూర్తి ఉంటే మేం పిలిచినప్పుడు హుందాగా వచ్చి అవతరణ వేడుకల్లో పాల్గొని ఉండేవాడు. సంబరాల్లో పాల్గొననివాడు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకున్నవాడు తెలంగాణ బాగును ఎలా కోరుకుంటాడు?’’ అని నిలదీశారు. స్వార్థం, దోపిడీ, తన కుటుంబానికే అన్నీ ఉండాలన్న కోరిక.. ఇవన్నీ ఎల్లకాలం కేసీఆర్‌ను బతికించవని మండిపడ్డారు.


విద్యుత్తు కమిషన్‌ను డిమాండ్‌ చేసింది జగదీశ్‌ రెడ్డే

విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదించలేదని, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీశ్‌ రెడి ్డఅసెంబ్లీలో సవాల్‌ విసిరి మరీ విచారణకు డిమాండ్‌ చేశారని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. ‘‘కమిషన్‌ను ఏర్పాటు చేసిన మూడు నెలల వరకూ టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ ఏమీ మాట్లాడలేదు. కేసీఆర్‌ను వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించిన తర్వాత ఆరోపణలు చేస్తున్నారు. విచారణ కమిషన్‌ వేయడం తప్పా? కేసీఆర్‌ను వివరణ ఇవ్వాలని అడిగినందుకు తప్పు పడుతున్నారా? జస్టిస్‌ నర్సింహా రెడ్డిని తప్పు పడుతున్నారా? బీఆర్‌ఎస్‌ నేతల మాటల్లోనే వ్యత్యాసం ఉంది. వాళ్లకే సమన్వయం లేదు’’ అని ఎద్దేవా చేశారు. వాళ్లు డిమాండ్‌ చేస్తేనే విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, అవకాశం వచ్చినప్పుడు ఒకరు శ్రీరామచంద్రుడు, మరొకరు సత్య హరిశ్చంద్రుడు అని నిరూపించుకుంటే సరిపోతుంది కదా? అని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ నర్సింహా రెడ్డి కమిషన్లో లోపాలు ఏమైనా ఉంటే విచారణకు వెళ్లి కేసీఆర్‌ తన అనుభవాన్ని ఉపయోగించుకుని అద్భుతంగా వాదించుకోవచ్చు కదా అని అన్నారు. కేసీఆర్‌ కోరుకుంటే లైవ్‌ టెలికా్‌స్టకు ప్రభుత్వం కూడా కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.


పక్క రాష్ట్రాల్లోలా రాజకీయ కేసులుండవు

‘‘తెలంగాణలో ఇప్పటి వరకూ ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు కాలేదు. గతంలో పక్క రాష్ట్రాల్లో జరిగినట్లు మా పాలనలో ఉండవు. చిన్న కేసు కూడా నమోదు కాలేదంటే మా పాలన బాగున్నట్లా? బాగా లేనట్లా?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి నిధులు, అనుమతులతో సహా ఏపీతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని, ఏపీ సర్కారుతో చర్చల పట్ల తమ ప్రభుత్వానికి ఎటువంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో వీలైన మేరకు సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. ‘‘కేంద్రం వల్ల కూడా కాకపోతే సమస్యల పరిష్కారానికి కోర్టులున్నాయి. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వివిధ వేదికలను ఉపయోగించుకుంటాం. పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయ పడం. మా రాష్ట్ర అభివృద్ధి కోసం అలసత్వం ప్రదర్శించం’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. రోజుకూ 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ పునర్నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. తనకు ఫాంహౌజ్‌లలో పడుకునే అలవాటు లేదని రేవంత్‌ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులతో చర్చలు సానుకూలంగా జరిగాయని, కంటోన్మెంట్‌లో 25 ఏళ్లుగా పెండింగులో ఉన్న ఎలివేటెడ్‌ కారిడార్లకు అనుమతులు తీసుకున్నామని, నిధులు విడుదల చేయించుకున్నామని, త్వరలోనే ప్రధానిని, హోం మంత్రిని కలవనున్నామని తెలిపారు.


చివరిగా ఉండేది పార్టీయే: మంత్రి శ్రీధర్‌ బాబు

నాయకుల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నా.. చివరికి కాంగ్రెస్‌ పార్టీనే తమలో ఉంటుందని మంత్రి శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ చేరికతో జీవన్‌రెడ్డిమనస్తాపం చెందారని, కాంగ్రెస్‌ అంతర్గత అంశంపై చిచ్చు పెట్టాలని కొన్ని పార్టీల నాయకులు చూశారని, కానీ.. పార్టీ నేతలు చూపిన ఐకమత్యం చిచ్చు పెట్టాలని చూసిన ఇతర పార్టీల నాయకులకు మేలుకొలుపని వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 28 , 2024 | 04:01 AM