Share News

Dams: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:42 PM

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొంత మేర నదులు శాంతించాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Dams: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద ఇదీ పరిస్థితి..

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశాయి. ఇళ్లల్లోకి భారీగా వరదనీరు చేరి ఆహారం, మంచినీళ్లు లేక వరద బాధితులు ఆర్తనాదాలు చేశారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొంత మేర నదులు శాంతించాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..


ప్రకాశం బ్యారేజ్‌..

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కి నిన్న(మంగళవారం) ఉదయం నుంచీ క్రమంగా వరదనీటి ప్రవాహం తగ్గుతోంది. ప్రస్తుతం బ్యారేజ్‌కు 4.56లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. బ్యారేజ్ దిగువ భాగాన కృష్ణానది ముంపు గ్రామాల ప్రజలు ఇప్పడిప్పుడే వరద ప్రభావం నుంచి బయటపడుతున్నారు. మరోపక్క గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు గ్రామాల్లో వరద ప్రభావం క్రమంగా తగ్గుతోంది. అయితే ఇటీవల ప్రకాశం బ్యారేజ్‌కు రికార్డుస్థాయిలో 11లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు చేరిన విషయం తెలిసిందే.


తుంగభద్ర జలాశయం..

కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,633అడుగులు కాగా.. ప్రస్తుతం 1,631.92 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 39,945 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 15,235 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 101.461 టీఎంసీలుగా ఉంది.


నాగార్జున సాగర్ ప్రాజెక్టు..

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉదయం 10గంటల సమయానికి ప్రాజెక్టు 10గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,88,549క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,16,535 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.20అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 301.35 టీఎంసీలకు చేరుకుంది.


శ్రీశైలం జలాశయం..

నంద్యాల శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 1,43,199క్యూసెక్కులు ఉండగా.. ప్రాజెక్టు గేట్లు ఎత్తి 67,897క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. మరోవైపు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 208.7 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


లోయర్ మానేరు..

కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం లోపు లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 17టీఎంసీలకు నీరు చేరింది. 35వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో మధ్యాహ్నానికి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో మానేరు నదీ తీర ప్రాంత ప్రజలు, రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


జూరాల ప్రాజెక్టు..

మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద తగ్గుముఖం పట్టింది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.810మీటర్లకు వరదనీరు చేరింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,35,000 క్యూసెక్కులు ఉండగా.. పూర్తి అవుట్ ఫ్లో 94,893క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 9గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 61,830 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 32,339 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.657టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 8.241టీఎంసీలకు చేరుకుంది.


కోయల్ సాగర్ ప్రాజెక్టు..

మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,800క్యూసెక్కులుగా ఉండగా.. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 2,800క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 2.270టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.008టీఎంసీలుగా ఉంది.


భద్రాచలం..

భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం వద్ద గోదావరి 42.40అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9,07,569క్యూసెక్కులుగా ఉంది. అయితే గోదావరి 43 అడుగులు దాటగానే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

కడెం ప్రాజెక్టు..

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు 22వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 31వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 695.475అడుగులకు చేరుకుంది.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు

మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4.52లక్షల క్యూసెక్కులు ఉండగా.. 32గేట్లు ఎత్తి 4.82లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి సామర్థ్యం 20.175టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 14.4043టీఎంసీలకు వరదనీరు చేరింది.


మేడిగడ్డ బ్యారేజ్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీకి 8,85,620 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజ్ మొత్తం 85గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు..

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీటి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు 28వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1403.02 అడుగులకు చేరుకుంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 15.006 టీఎంసీలకు వరదనీరు చేరింది.

సింగూర్ భాగారెడ్డి ప్రాజెక్టు..

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ భాగారెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఇన్ ఫ్లో 43,028 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 401 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 23.950 టీఎంసీలకు చేరుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Patancheru: హైడ్రా పేరుతో రూ.20 లక్షలు డిమాండ్‌...

Secunderabad: రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు..

Hyderabad: నిర్విరామంగా ఆపరేషన్‌ ధూల్‌పేట్‌

Updated Date - Sep 04 , 2024 | 01:29 PM