Share News

Etela Rajender: రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు

ABN , Publish Date - May 20 , 2024 | 04:54 AM

తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

Etela Rajender: రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు

  • తాలు, తరుగు పేరుతో 5-10 కిలోల కోత

  • మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం

  • కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు

  • అన్నదాతలను సర్కారు ఆదుకోవాలి: సంజయ్‌

  • పదేళ్ల కరువు తీరేలా రేవంత్‌ పైసావసూల్‌: ఈటల

హైదరాబాద్‌/నల్లగొండటౌన్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు అమలు కాకపోవడం విచారకరమన్నారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు క్వింటాకు రూ.200-రూ.500 వరకు నష్టపోతున్నారని తెలిపారు. సకాలంలో వడ్లను కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వరికి రూ.500 బోనస్‌ ఏమైందని ప్రశ్నించారు. సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వర్షాలు కురుస్తున్నందున కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని సంజయ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


రాహుల్‌ ప్రధాని కావడం కల: ఈటల

అతి తక్కువ కాలంలో ప్రజలతో చీ కొట్టించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఆయన అతితక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేసి పదేళ్ల కరువును ఒక్కసారే తీర్చుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగానే డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ సొంత పనులు చేసుకుంటున్నారు తప్ప ప్రజల బాగోగులను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఈటల మీడియాతో మాట్లాడారు. కాంగ్రె్‌సలో కమీషన్ల దుకాణం తెరిచారని.. ప్రభుత్వ ఆదాయం పెంచడం కంటే కొంతమంది అధికార పార్టీ నేతలు వారి సొంత ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంపునకు భూముల రేట్లు పెంచడం సరికాదని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిపోయిందని, రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఉచిత బస్సు తప్ప ఏ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. రూ.లక్ష రుణమాఫీ చేయడం బీఆర్‌ఎ్‌సకు సాధ్యం కాలేదని, రూ.2 లక్షల రుణమాఫీ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం, రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం కలేనని ఈటల అన్నారు.


లిక్కర్‌ స్కాంలో దోషులు తప్పించుకోలేరు: ఎన్వీఎ్‌సఎస్‌

న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థల విచారణ పారదర్శకంగా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ తెలిపారు. ఈ కేసులో దోషులెవ్వరూ తప్పించుకోలేరని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ దగ్గర ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో బీఆర్‌ఎస్‌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, కేసు నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఆరోపణలు చేసేవారిని తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.

Updated Date - May 20 , 2024 | 04:54 AM