Bhadradri: వాగుతో పెద్ద డేంజర్
ABN , Publish Date - Jul 19 , 2024 | 04:26 AM
ఒకవైపు ఎడతెరిపి లేని వర్షం.. మరోవైపు ఆకస్మికంగా వచ్చి పడిన వరద.. ఇంతలో మొరాయించిన ప్రాజెక్టు గేటు.. కట్టకు గండ్లు.. దాని పైనుంచి ప్రవాహం.. ఏ క్షణంలోనైనా తెగి ఊళ్లు మునిగే ప్రమాదం..! మధ్యలో చిక్కుకుపోయిన ప్రజలు..!
భద్రాద్రి జిల్లా అశ్వారావు పేటలోని పెదవాగుకు భారీ వరద
నారాయణపురంలో 2 వాగుల మధ్య చిక్కుకున్న 25 మంది
హెలికాప్టర్ ద్వారా బాధితులను రక్షించిన సిబ్బంది
రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఒకవైపు ఎడతెరిపి లేని వర్షం.. మరోవైపు ఆకస్మికంగా వచ్చి పడిన వరద.. ఇంతలో మొరాయించిన ప్రాజెక్టు గేటు.. కట్టకు గండ్లు.. దాని పైనుంచి ప్రవాహం.. ఏ క్షణంలోనైనా తెగి ఊళ్లు మునిగే ప్రమాదం..! మధ్యలో చిక్కుకుపోయిన ప్రజలు..! ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి సమీపంలోని పెదవాగు రేపిన కలకలం. గురువారం తెల్లవారుజాము నుంచి ఎగువన భారీ వర్షాలు కురవడంతో పెదవాగు ఉగ్ర రూపం దాల్చింది. ఉదయం 11 గంటలకు సాగునీటి అధికారులు రెండు గేట్లు ఎత్తి 22,500 క్యూసెక్కులను విడుదల చేశారు. అంతలోనే ఎవరూ ఊహించని రీతిలో పెదవాగు ఉధృతి పెరిగింది. మూడు చోట్ల గండ్లు పడ్డాయి. ఔట్ ఫ్లోకు ఇన్‌ఫ్లో కొన్ని రెట్లు ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్ట్ నిండిపోయింది. అన్నివైపులా కట్టపై నుంచి నీరు పొంగి ప్రవహించింది. మోటారు కాలిపోవడంతో మూడో గేటు తెరుచుకోలేదు. కట్ట కింద గుమ్మడపల్లి గ్రామస్థులు భయంతో మెరక ప్రాంతానికి వెళ్లిపోయారు.
వాగుల మధ్యలో 25 మంది
పెదవాగు వరద నారాయణపురం-పెదవాగు ప్రాజెక్టు మధ్య కట్టమైసమ్మ ఆలయం సమీపంలోని రోడ్డును దాటి పంట పొలాలను చుట్టుముట్టింది. నారాయణపురం, జగన్నాథపురం, బచ్చువారిగూడెం గ్రామాలకు చెందిన 25 మంది రైతులు, కూలీలు, పశువుల కాపర్లు సాయంత్రం వరకు వాగు మధ్యలోనే ఉండిపోయారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రెస్క్యూ బృందాలను పిలిపించే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేతో పాటు స్థానికులు ఫోన్ ద్వారా మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ఆలస్యం అవుతుందని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు ఫోన్ చేశారు. ఏలూరు మీదుగా హెలికాప్టర్ పంపేలా చూశారు. ఈలోగా భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని అప్రమత్తం చేశారు. హెలికాప్టర్ రాత్రి 7.30 గంటల ప్రాంతంలో.. వరదలో చిక్కుకున్న వారిని కాపాడింది. కాగా, పెద వాగు ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు.
అశ్వారావుపేటలో 16 సెం.మీ. వర్షం
కొత్తగూడెం జిల్లాలో గురువారం భారీ వర్షంతో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు పొంగి ప్రవహించాయి. పలు మండలాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దమ్మపేట మండలం జమేదారు బంజరలో పిడుగుపడి బొర్రా మల్లేష్- నాగమణి దంపతుల కుమారులు సిద్ధూ(15), చందు(11) చనిపోయారు. మల్లేష్ దంపతులు పిల్లలతో చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతారం గ్రామం జల దిగ్బంధమైంది. 30 ఇళ్లను ఖాళీ చేయించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 18.2 అడుగుల వద్ద ఉంది. ఖమ్మం జిల్లాను ముసురు కమ్మేసింది. వేంసూరు, సత్తుపల్లిలో 4 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. కాగా, నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో భారీ, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఈదురుగాలులతో పాటే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలో కొట్టుకుపోయిన కారు
అందులో ఐదుగురు.. కాపాడిన గ్రామస్థులు
ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొండవాగు ఉధృతిలో కారు కొట్టుకుపోయింది. రాజమహేంద్రవరం నుంచి వేలేరుపాడు మండలం రుద్రంకోట వెళ్లేందుకు గడ్డం సాయికుమారి తల్లి సింగవరపు జ్యోతి, మేనమామ, రామారావు, తన ఇద్దరు పిల్లలు కుందనకుమార్, జగదీ్‌షకుమార్ (8)తో గురువారం బయల్దేరారు. కోయమాధవరం - అల్లూరినగర్ మధ్య కొండ వాగు ప్రవాహంలో 200 మీటర్లు కొట్టుకువెళ్లి ఎదురుపొదల్లో చిక్కుకుంది. 40 మంది గ్రామస్థులు ఈదుకుంటూ కారువద్దకు చేరుకున్నారు. అప్పటికే జగదీ్‌షకుమార్ బయటపడి వెదురుపొదల్లో చిక్కుకున్నాడు. గ్రామస్థులు 3 గంటలు శ్రమించి వారందరినీ ఒడ్డుకు చేర్చగలిగారు. ఆ ప్రాంతానికి మరో 200 మీటర్ల దూరంలోనే పెదవాగు బీకరంగా ప్రవహిస్తోంది. ఆ వాగులో పడితే గోదావరిలో కలిసిపోయేవారు. కారు కొట్టుకుపోయిన విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు క్షణాలో స్పందించారు. రెండు హెలికాప్టర్‌లను సమకూర్చారు. కాగా, ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.