Share News

Hyderabad: అనుమతుల్లేని మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలు హైకోర్టు ఆదేశం..

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:34 AM

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ కామర్స్‌ అండ్‌ డిజైన్‌ (ఆఫ్‌ క్యాంప్‌స)పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), రాష్ట్ర ఉన్నతవిద్యామండలికి ఆదేశాలు జారీచేసింది.

Hyderabad: అనుమతుల్లేని మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలు హైకోర్టు ఆదేశం..

  • అనుమతుల్లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ కామర్స్‌ అండ్‌ డిజైన్‌ (ఆఫ్‌ క్యాంప్‌స)పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), రాష్ట్ర ఉన్నతవిద్యామండలికి ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్‌క్యాంపస్‌ ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ నవీనా ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ప్రతిభా డిగ్రీ కాలేజ్‌, ఏ మనోహర్‌ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. ప్రతివాదులైన మల్లారెడ్డి యూనివర్సిటీ, ఆఫ్‌క్యాంప్‌సకు వ్యక్తిగత నోటీసులు అందజేయాలని ఏప్రిల్‌ 25న పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీచేసింది.


మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రతినిధులు నోటీసులు స్వీకరించినా మల్లారెడ్డి వర్సిటీ ఆఫ్‌క్యాంపస్‌ ప్రతినిధులు మాత్రం నిరాకరించారు. ఈ అంశంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నోటీసులు తిరస్కరించినా అందినట్లుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వాదనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహా ఇతర అధికారిక ప్రతివాదులెవరూ వ్యతిరేకించలేదు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఆఫ్‌క్యాంపస్‌ సెంటర్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

Updated Date - Jul 05 , 2024 | 03:34 AM