Share News

Weather Conditions: ఉక్కపోతలో వాన పలకరింత

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:14 AM

ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా తీవ్రమైన ఉక్కపోత నడుమ వాన పలకరించింది. రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల మోస్లరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మెదక్‌లో గంటపాటు వాన పడింది.

Weather Conditions: ఉక్కపోతలో వాన పలకరింత

  • రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. మెదక్‌లో 6.7 సెం.మీ.

  • ఆదిలాబాద్‌, గజ్వేల్‌, భైంసాలలో దంచికొట్టిన వాన

  • వేర్వేరుచోట్ల పిడుగుపాటుకు రైతు, గొర్రెల కాపరి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా తీవ్రమైన ఉక్కపోత నడుమ వాన పలకరించింది. రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల మోస్లరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మెదక్‌లో గంటపాటు వాన పడింది. 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని పాతూర్‌లో 4.4 సెం.మీ., నాగాపూర్‌లో 3.9 సెం.మీ., సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో 6.3 సెం.మీ. వర్షం కురిసింది. ఈ జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో 4 సెం.మీ. ఆపైన వర్షం పడింది.


ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ (టి)లో ప్రధాన రహదారుల్లో నీరు నిలిచింది. హైదరాబాద్‌లో హయత్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు భారీగా వర్ష పడింది. నిర్మల్‌ జిల్లా మామడలో 6.3 సెం.మీ. వానపడింది. ఏకధాటిగా రెండు గంటల పాటు వర్షం పడడంతో భైంసా తడిసి ముద్దయింది. కాగా, ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలం ఎల్లూరులో వరి నాట్లు వేస్తున్న రైతు సిడాం శ్రీనివాస్‌ (46)పై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా దేవరకొండలో చెట్టు కింద నిల్చున్న గొర్రెల కాపరి సతీష్‌ (42) పిడుగుపడి ప్రాణాలు కోల్పోయాడు.


  • 20వ రోజూ సాగర్‌కు వరద

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 20వ రోజూ వరద కొనసాగింది. ఆదివారం 2 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 24,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలానికి 91,592 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. సాగర్‌కు 68,721 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో మిడిల్‌ కృష్ణా, ఘట్‌ ప్రభ, మలప్రభ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి స్వల్పంగా వరద మొదలైంది. ఈ నీరు నేరుగా నారాయణపూర్‌ జలాశయం చేరుతోంది.


ఆది, సోమవారాల్లో ఎగువ కృష్ణా, ఎగువ భీమా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉండడంతో ఆల్మట్టికి కూడా వరద పెరగవచ్చని తెలుస్తోంది. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా 128.19 టీఎంసీలకు చేరింది. జూరాలకు 50,500 ఇన్‌ఫ్లో ఉండగా జల విద్యుదుత్పత్తి ద్వారా 40,157 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు 28,,041 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10,695 క్యూసెక్కులు వదులుతున్నారు. 19వ గేటు మరమ్మతులు పూర్తి కావడంతో నీటి నిల్వలు పెంచుకునేందుకు గేట్లను మూసివేశారు.

Updated Date - Aug 19 , 2024 | 04:14 AM