Share News

Hyderabad: సంధ్య థియేటర్ ఘటనలో ముగ్గురి అరెస్ట్

ABN , Publish Date - Dec 08 , 2024 | 08:00 PM

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చిన దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు.

Hyderabad: సంధ్య థియేటర్ ఘటనలో ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు.


వారికి జ్యూడిషల్ రిమాండ్‌ విధించాం: చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్

పుష్ప2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ తెలిపారు. సంధ్య థియేటర్ మొత్తం ఏడుమంది యజమానుల్లో సందీప్ ఒకరని చెప్పారు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్‌ని కోర్టులో హాజరు పరిచామని అన్నారు. వారిని జ్యూడిషల్ రిమాండ్‌కు తరలించామని అన్నారు. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉందని అన్నారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారు. లీగల్ టీంను సంప్రదించి తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ పేర్కొన్నారు.


వెలుగులోకి సంచలన విషయాలు...

కాగా.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి 9.40 గంటల సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని.. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని తెలిపారు. ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న సమాచారం తమకు లేదని తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఆ సమాచారం చెప్పలేదని పేర్కొన్నారు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలిపారు. పబ్లిక్‌ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్‌లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.

ALLU-ARJUN1.jpg


ప్రేక్షకుల మధ్య తోపులాట..

నటీనటులకు కూడా ఎలాంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. 9.30గంటలకు తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని.. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించారని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో థియేటర్‌లోని కొంతమందితో అల్లు అర్జున్ కలిసి లోపలకు వెళ్లారని తెలిపారు. దీంతో ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటుచేసుకుందని వివరించారు.


రేవతి మృతి..

ఇదే సమయంలో దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి అతని కుమారుడుతో ఆ ప్రాంతంలో ఉందని..అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదని..అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది 13 ఏళ్ల శ్రీతేజ్‌కు సీపీఆర్ చేశారని, వెంటనే రేవతి కుమారుడు శ్రీ తేజను దుర్గాబాయి దేశముఖ ఆసుపత్రి తరలించారని తెలిపారు. అయితే, అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. శ్రీ తేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడ వైద్యులు సూచించారన్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పలు సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PUSHPA-2.jpg


ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు..

మరోవైపు ‘పుష్ప-2’ సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టు పిటిషనర్ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై దర్యాప్తు జరపనుంది.

Updated Date - Dec 08 , 2024 | 10:13 PM