Share News

KTR: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసింది: కేటీఆర్..

ABN , Publish Date - Nov 27 , 2024 | 09:48 AM

తెలంగాణ రైతన్నలు రుణం తీరక, కొత్త రుణాలు పుట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంత జరుగుతున్నా రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం కలగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

KTR: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసింది: కేటీఆర్..
BRS Working President KTR

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రూ.15 వేల రైతు భరోసా కోసం రైతులు, కౌలు రైతులు ఎదురుచూస్తున్నారని, రూ.12 వేల రైతు భరోసా కోసం రైతు కూలీలు ఆశగా చూస్తున్నారని ఆయన అన్నారు. రెండు పంటలకే రైతు బంధు ఇస్తారా.. మూడో పంటకు ఇవ్వరా? అంటూ అధికారం చేపట్టిన కాంగ్రెస్.. మొదటి పంటకే పెట్టుబడి సాయం అందించకుండా అన్నదాతలు బిక్కమెుఖం వేయాల్సిన పరిస్థితులు తెచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.


"యాసంగి పోయి వానాకాలం వచ్చింది. వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చింది. నాడు గల్లా ఎగరేసిన రైతు నేడు నేలచూపులు చూస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మన్యూనతతో ఉన్నాడు. రుణం తీరక, కొత్త రుణం లేక, అప్పుపుట్టక రైతన్న ఆగమైపోతున్నాడు. ఇంత జరుగుతున్నా రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదు. రైతు భరోసా కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో ఇప్పటివరకూ స్పష్టత లేదు. రైతు భరోసా సాయం సున్నా, రుణమాఫీ అరసున్నా, రైతు బీమా గుండు సున్నా. కాంగ్రెస్ కఠిన గుండెలు కరిగేదెన్నడు?. రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేదెన్నడు?. జాగో తెలంగాణ.


తెలంగాణలో ఫించన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?. టంచన్‌గా అకౌంట్‌లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?. మూసీ బ్యూటిఫికేషన్ కోసం రూ.1.50 లక్షల కోట్లు వెదజల్లే సీఎం కనికరం లేకుండా వృద్ధుల పెన్షన్లు ఆపుతారని ఎవరనుకున్నారు?. మందుబిల్లల కోసం కొడుకులు, కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే 'మార్పు' వస్తుందని ఎవరనుకున్నారు?. అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు?. మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు?" అంటూ ట్వీట్ చేశారు.


అరెస్టులు దుర్మార్గం..

మరోవైపు తెలంగాణలో ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్టులు దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మాగనూరు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని హరీశ్ రావు అన్నారు. తమ కార్యకర్తల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం?, పురుగులు పట్టిన అన్నం వద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా?, విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టని దీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అప్రజ్యాస్వామిక విధానాలు విడనాడాలని, అరెస్టు చేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి, తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు.. ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి..

Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇంకా ఆదుపులోకి రాని మంటలు..

Updated Date - Nov 27 , 2024 | 10:06 AM