TG News: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్..
ABN , Publish Date - Aug 15 , 2024 | 10:05 PM
వైరాలో నిర్వహించిన మూడో విడత రైతు రుణ మాఫీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి హరీశ్ రావుపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా, నయవంచన చేసిందంటూ మండిపడ్డారు.
హైదరాబాద్: వైరాలో నిర్వహించిన మూడో విడత రైతు రుణ మాఫీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి హరీశ్ రావుపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా, నయవంచన చేసిందంటూ మండిపడ్డారు.
రైతు రుణమాఫీ బోగస్ పథకం..!
బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీకే రూ.17వేల కోట్లు ఖర్చు అయితే సీఎం రేవంత్ రెడ్డి కేవలం రూ.17,900 కోట్లతో రూ.2లక్షల రుణమాఫీ ఎలా చేయగలిగారో రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంకెల గారడీ చేశారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ మొత్తం రెట్టింపు అయినప్పుడు లబ్ధిదారుల సంఖ్య తగ్గడం కాంగ్రెస్ మోసపూరిత విధానానికి నిలువెత్తు నిదర్శనం అని ఆయన అన్నారు. ముమ్మాటికీ ఇది రైతులకు ద్రోహం చేయడమే అని ధ్వజమెత్తారు. వరికి బోనస్ పథకం లాగే రుణమాఫీ కూడా బోగస్ పథకం అని, చారాణ రుణమాఫీకి బారాణా ప్రచారం అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.
మమ్మల్ని తిట్టకపోతే సీఎంకు పూట గడవదు..
స్వాతంత్ర్య దినోత్సవం రోజునా సీఎం రేవంత్ బూతు పురాణం అందుకోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రుణ మాఫీ పూర్తి చేయనందుకు ముఖ్యమంత్రి అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని ఆమె అన్నారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే సీఎం బూతులు తిట్టారంటూ సబితా మండిపడ్డారు. సీఎం తనకు తాను ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను తిట్టకపోతే ఆయనకు పూట గడవడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా హామీల అమలుపై బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందని ఎమ్మెల్యే సబితా చెప్పారు.
కాంగ్రెస్‌ను ఛీ కొడుతున్నారు..!
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతు రుణమాఫీ విషయంలో సీఎం పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పే ఆ నోటిని ముందుగా ఆయన ప్రక్షాళన చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావును తిట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డి చేసిన తప్పులు ఒప్పులు కావని అన్నారు. రైతు రుణ మాఫీ ఓ అంకెల గారడీ అంటూ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.