Hyderabad: విద్యార్థిని శైలజ కుటుంబాన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వరా: కేటీఆర్ సూటి ప్రశ్న..
ABN , Publish Date - Nov 26 , 2024 | 11:34 AM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థిని శైలజ మృతిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చనిపోతున్నా మంత్రులు మెుద్ద నిద్ర వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కలుషిత ఆహారం తిని తొమ్మదో తరగతి విద్యార్థిని శైలజ మృతిచెందడం రాజకీయ రగడకు దారి తీసింది. విద్యార్థిని మృతిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బాలిక మరణిస్తే పరామర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీడియా, ప్రజాప్రతినిధులకు వాంకిడి మండలం దాబా గ్రామానికి పోలీసులు అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన బాలిక గ్రామంలోకి నో ఎంట్రీ అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా పోలీసులు భారీగా మోహరించడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో 48 మంది విద్యార్థులు మృతిచెందారంటూ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయని మండిపడింది. ఆహారం విషతుల్యమై కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారని ధ్వజమెత్తింది. ఈ మేరకు పార్టీకి సంబంధించిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. "ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం తాండవిస్తోంది. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగుల్చుతున్నాయి. ఏడాదిగా హాస్టళ్లలో అనుమానాస్పద మరణాలు, బలవన్మరణాలు, అనారోగ్యం, కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోవడం వంటి ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం, వార్డెన్, ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయడంతో సరిపెడుతోంది. సమస్యకు మూల కారణాలు కనుక్కొని శాశ్వత పరిష్కారం చూపడంపై దృష్టి సారించడం లేదు. కనీసం మంత్రులు సమీక్ష జరపడం లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు" అంటూ ట్వీట్ చేసింది.
కాగా, వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ అక్టోబర్ 30న ఫుడ్ పాయిజన్‌కు గురైంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. విద్యార్థిని మృతదేహాన్ని వాంకిడి మండలం దాబా గ్రామానికి పోలీసులు చేర్చారు. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని, ఆ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను సైతం ఆపేశారు. వాంకిడి వైపు వెళ్లే వారిని పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఒక్కరిని మాత్రమే గ్రామంలోకి అనుమతించారు. అయితే పరామర్శించేందుకు ఎవ్వరినీ అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: నయా దందా.. మూసీయే వారికి ప్రధాన ఆదాయం..
Biryani: దెబ్బతిన్న హైదరాబాదీ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్..