CM Revanth Reddy: మరిన్ని బస్సుల కొనుగోలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..
ABN , Publish Date - Sep 10 , 2024 | 08:57 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పెరిగిన అవసరాలు దృష్ట్యా మరిన్ని బస్సులు కొనుగోలు చేసి ప్రజా రవాణా సులభతరం చేయాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీపై సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ అప్పులు, లాభాల్లోకి తీసుకురావాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.
83.42కోట్ల మంది..
మహాలక్ష్మి పథకం అద్భుతంగా ఉందని, ఇప్పటివరకూ 83.42కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. నగదు చెల్లించకుండా ప్రయాణించడంతో తెలంగాణ ఆడబిడ్డలకు రూ.2,840.71కోట్లు ఆదా అయ్యాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎంకు తెలిపారు. 7,292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ ఆస్పత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని, అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. దీంతో మరిన్ని బస్సులు కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేయాలంటూ సీఎం ఆదేశించారు.
అప్పులు ఇవీ..
వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు తదితరాలు అన్నీ కలిపి ఆర్టీసీకి రూ.6,322కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అయితే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువగా ఉందని.. వడ్డీ రేట్ల తగ్గింపు, అప్పుల రీకన్‌స్ట్రక్షన్‌పై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంస్థపై క్రమంగా రుణభారం తగ్గించాలని సూచించారు. మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేటు పెరగడంతోపాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్‌కు భారీ విరాళాలు..
CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు
Vemula Prashanth Reddy: అరికెపూడి గాంధీకి పీఏసీ ఛైర్మన్ ఇవ్వడం దుర్మార్గం..
KTR: 499మందిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు: ఎమ్మెల్యే కేటీఆర్..