Share News

CM Revanth Reddy : ఆ విషయంలో కేంద్రం వైఖరీ ఏంటీ.. సీఎం రేవంత్ ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Dec 24 , 2024 | 08:53 PM

CM Revanth Reddy: భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలేవా అని కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. మన దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడుతే అధునాతన ఆయుధాలతో ఊచకోత కోసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy :  ఆ విషయంలో  కేంద్రం వైఖరీ ఏంటీ.. సీఎం రేవంత్ ప్రశ్నల వర్షం

హైదరాబాద్: చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించాలి.. అప్పుడే దేశంలో శాంతి నెలకొల్పబడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రవీంద్రభారతిలో ఇవాళ(మంగళవారం) "NUTS, BOLTS OF WAR & PEACE" పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన "NUTS BOLTS OF WAR & PEACE" పుస్తకాన్నిసీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కూనంనేని సాంబశివరావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. చాలా మంది సిద్ధాంతాలు చెబుతారు... కానీ పాటించే వారు మాత్రం కొద్దిమందే ఉంటారని తెలిపారు. అలాంటి వారిలో యాదవరెడ్డి ఒకరని.. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి అని కొనియాడారు. సురవరం లాంటి నేతలు హార్డ్‌కోర్ కమ్యూనిస్టులు అయితే... జైపాల్ రెడ్డి, యాదవ రెడ్డి లాంటి నేతలు సాఫ్ట్‌కోర్ కమ్యూనిస్టులు అని గుర్తుచేశారు. దేశంలో పేదలకు అభివృద్ధి ఫలాలను అందించేందుకు వారు కాంగ్రెస్ పార్టీలో పని చేశారని ఉద్ఘాటించారు. పదవుల కోసం కాకుండా... సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారు పని చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.


తెలంగాణ ఆవశ్యకతలో యాదవరెడ్డి కృషి ..

‘‘తెలంగాణ ఉద్యమంలోనూ యాదవరెడ్డి కృషి ఎంతో ఉంది. తెలంగాణ కోసం తెర వెనుక కృషి చేసిన వారిలో ఆయన ఒకరు. తెలంగాణ కోసం సోనియాగాంధీ చర్చించిన సమయంలో ఆయన కూడా తెలంగాణ ఆవశ్యకతను వివరించారు. తెలంగాణ బిల్లును ఆమోదించడంలో జైపాల్ రెడ్డితో పాటు యాదవ రెడ్డి తన బాధ్యత నిర్వహించారు. ముల్కీ- నాన్ ముల్కీ నుంచి, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు సంపూర్ణ వివరాలతో ఒక పుస్తకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమాలను వివరిస్తూ తెలంగాణ ఉద్యమం చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరుతున్నా. ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారి గురించి కూడా ఆ పుస్తకంలో వివరించాల్సిన అవసరం ఉంది. అలాంటి పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.


ఆ విషయంపై చర్చకు ధైర్యం లేదు..

‘‘2014 తర్వాత దాదాపు 2వేల నుంచి 4వేల చదరపు కి.మీ వరకు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వానికి ధైర్యం లేదు.. చర్చించే వారు అసలే లేరు. మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు కారణం అక్కడ అధునాతన ఆయుధాలు ఉండటమే. ఖనిజ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడితే అధునాతన ఆయుధాలతో ఊచకోత కోసుకునే పరిస్థితి ఏర్పడింది. భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలేవా?... తలచుకుంటే అక్కడి ఆయుధాలను సీజ్ చేయలేరా? దేశంలో నెలకొన్న భయానక వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది.. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

DK Aruna: అల్లు అర్జున్‌పై వేధింపులకు కారణం అదే.. డీకే అరుణ సంచలన కామెంట్స్

Allu Arjun: బన్నిని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా..

TG highcourt: కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 08:59 PM