Share News

CM Revanth Reddy: గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Aug 25 , 2024 | 12:14 PM

గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని తెలిపారు. తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉద్ఘాటించారు.

CM Revanth Reddy: గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతాం
CM Revanth Reddy

హైదరాబాద్: గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు ఎక్కువ పతకాలు సాధించేలా కృషి..వచ్చే విద్యా సంవత్సరం నుంచి యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ప్రారంభిస్తామని వెల్లడించారు. క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌ను వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఈరోజు(ఆదివారం) కోకాపేట్‌లో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపనను సీఎం రేవంత్ చేశారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని ఆరోపించారు. క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నానని అన్నారు. ఒలంపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్‌లో ప్రారంభించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


అంతర్జాతీయ స్థాయి కోచ్‌లను తీసుకువచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తామని వివరించారు. ఒలింపిక్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపామని అన్నారు. దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Aug 25 , 2024 | 12:18 PM