Share News

CM Revanth Reddy: నేడే ఆ పాదయాత్ర ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Nov 08 , 2024 | 07:50 AM

శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

CM Revanth Reddy: నేడే ఆ పాదయాత్ర ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

యాదాద్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ (శుక్రవారం) యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. నేడు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన ముందుగా యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 11:30లకు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.


శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా దాదాపు 2.5 కిలోమీటర్లు కాలినడకన మూసీ నది కుడి ఒడ్డున ఉన్న భీమలింగం కత్వాకు ఆయన చేరుకుంటారు. అనంతరం అక్కడ్నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం- నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథం పైనుంచి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.


అనంతరం హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. వలిగొండ మండలంలో పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగుకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీశ్రేణులు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానూ పలువురు ప్రముఖులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు.

Updated Date - Nov 08 , 2024 | 08:12 AM