MLA Srinivas Reddy: కాంగ్రెస్‌పై కేటీఆర్, హరీశ్ రావు విషం చిమ్ముతున్నారు..
ABN , Publish Date - Aug 16 , 2024 | 04:53 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుంటే.. కేటీఆర్, హరీశ్ రావు మాత్రం కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుంటే.. కేటీఆర్, హరీశ్ రావు మాత్రం కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ మంచి పని చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు(Harish Rao), కేటీఆర్(KTR), ఆ పార్టీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి(MLA Srinivas Reddy) మీడియా సమావేశం నిర్వహించి వారిపై నిప్పులు చెరిగారు.
కేటీఆర్.. నీ సంస్కారం ఇదేనా..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేస్తుంటే కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. వీరిద్దరూ అధికారం పోయిన ఫ్రస్టేషన్‌లో ఉన్నట్లు అర్థం అవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నారని, అపరిచితుడు సినిమాలో ఉండే శిక్షలన్నీ కేసీఆర్ కుటుంబానికి వేయాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలపై రికార్డింగ్ డ్యాన్సులు అంటూ కేటీఆర్ అనుచిత వాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేనా మీ సంస్కారం అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ దిష్టి చుక్కలు కేటీఆర్, హరీశ్ రావు..
కేటీఆర్, హరీశ్ రావులు సిరిసిల్ల, సిద్దిపేటలో కాకుండా బయటకు వచ్చి పోటీ చేయాలని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా అవినీతి ప్రాజెక్టులు కట్టారని ఆయన ఆరోపించారు. మీ పదేళ్ల పాలనలో రూ.1.30లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. అలాంటి మీరు ఇంకా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీ విధ్వంసకర పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిందని అన్నారు. తెలంగాణకు దిష్టి చుక్కలుగా మీరిద్దరూ మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కాగ్నిజెంట్ శంకుస్థాపన ఎలా సాధ్యం అని కేటీఆర్ విమర్శిస్తున్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధి చూసి పెట్టుబడులు పెట్టేందుకు వారు ముందుకు వచ్చారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మీరు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని తెలిసి అప్పట్లో వారు వెనకడుగు వేశారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి సోదరులపై తప్పుడు ప్రచారాలు..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అనడానికి సిగ్గుండాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తన సోదరులకు రాజ్యసభ సీటు ఇచ్చారా లేక కాంట్రాక్టులు ఇచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. అలాంటి పనులు చేయాల్సిన అవసరం సీఎంకు లేదన్నారు. మీ ఎమ్మెల్యేలకు మీ మీదే నమ్మకం లేదని చెప్పుకొచ్చారు. హరీశ్ రావు ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చోవాలని రోజూ హంగామా చేస్తున్నారని, ముక్కు నేలకు రాసినా కల్వకుంట్ల కుటుంబం ఆయనకు ఏ పదవీ ఇవ్వదని ఎద్దేవా చేశారు. కష్టపడే నాయకుడని హరీశ్ రావుకు పేరుందని, దాన్ని కాపాడుకుంటే రాజకీయ భవిష్యత్ ఉంటుందని హితవుపలికారు. తెలంగాణ విధ్వాసానికి ఆయన కూడా కారణమని, తాను చేసిన తప్పులను ఇప్పటికైనా ఆయన సరిదిద్దుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హితబోధ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
TG Politics: జనగామ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు..
DCP Vineeth: మోస్ట్ వాంటెడ్ 53కేసులు.. పది సార్లు జైలుకు..