BRS: సీఎం రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు..
ABN , Publish Date - Nov 24 , 2024 | 06:18 PM
తెలంగాణలో ఎన్నికల హామీలను ఎగ్గొట్టారని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్లపై ఒట్టుపెట్టి మరీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. లగచర్లలో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి పీహెచ్డీ ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించిన మహారాష్ట్ర ప్రజలు అక్కడ కాంగ్రెస్‌ను ఓడించారని అన్నారు.
ఒట్టు వేసి మరీ మోసం..
తెలంగాణలో ఎన్నికల హామీలను ఎగ్గొట్టారని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్లపై ఒట్టుపెట్టి మరీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. లగచర్లలో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మారుస్తున్నారని మండిపడ్డారు. జులై 19, 2024 నాడు ఫార్మాసిటీ అంటూ ఈ ప్రభుత్వమే గెజిట్ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి ఆ గెజిట్ వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిపోతే మూసీకి నీళ్ల ఎలా పోతాయి? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? అంటూ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చినట్లు పాత బకాయిలు కలిసి పెన్షన్లు అందించాలని రేవంత్ రెడ్డిని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
చారానా కోడికి బారానా మసాలా..
హుజూరాబాద్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉండగా.. ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒడితెల ప్రణవ్‌తో చెక్కులు పంపిణీ చేయించడం సిగ్గుచేటని ఎక్స్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు. 13 గ్రామాలలో 26 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి 25 వాహనాలు, 100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారని విమర్శించారు. అసలు పంచిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల విలువెంత?.. 25 వాహనాలు, 100 మంది పోలీసుల జీతభత్యాల ఖర్చెంత? అంటూ ప్రశ్నించారు. చారానా కోడికి బారానా మసాలా అంటూ ఎద్దేవా చేశారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడమే చట్టవిరుద్ధమంటే.. పోలీసు బందోబస్తు పెట్టి మరీ పంపిణీ చేయించడం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేసీఆర్ వస్తే రేవంత్ ఖతం..
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్ము దులుపుతామన్న సీఎం రేవంత్ రెడ్డి దుమ్ములో కలిసిపోయారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఇకనైనా ఆయన బ్రోకర్ మాటలు మానుకుని, ప్రజా సమస్యల గురించి ఆలోచించాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ బయటకు వస్తుంటే అడ్డంకులు పెడుతున్న రేవంత్.. కేసీఆర్‌ను బయటకు రావాలని అనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ పని ఖతం అవుతుందని చెప్పుకొచ్చారు. గిరిజనులకు మేలు చేసిన ఏకైన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు ఎర్రబెల్లి. అన్నీ వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. మహబూబాబాద్‌లో సోమవారం చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాను ఆపేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు.