Share News

Harish Rao: పదవులు.. రాజీనామాలు నాకేం కొత్త కాదు!

ABN , Publish Date - Jul 18 , 2024 | 08:11 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అనుకున్నట్లుగానే రేవంత్‌రెడ్డి ఆగస్టు కంటే ముందే రుణమాఫీ చేసి చూపించారు.

Harish Rao: పదవులు.. రాజీనామాలు నాకేం కొత్త కాదు!
Harish Rao

హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుల మధ్య గత కొన్ని రోజులుగా సవాళ్ల పర్వం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా చెప్పినట్లుగానే రేవంత్‌రెడ్డి ఆగస్టు కంటే ముందే రుణమాఫీ చేసి చూపించారు. ఈ క్రమంలో హరీష్‌రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఈ రాజీనామాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు హరీష్ స్పందించారు. రాజీనామాకు సిద్ధమేనని అంటూ మరికొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.


ఇదీ నా చరిత్ర!

‘‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు. రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది‘‘ అని హరీష్ రావు స్పష్టం చేశారు.


నాకేం కొత్త కాదు..!

"నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను. మరోసారి చెబుతున్నా.. ఆగస్ట్ 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’’ అని రేవంత్ రెడ్డికి మరోసారి హరీష్ సవాల్ విసిరారు.

Updated Date - Jul 18 , 2024 | 08:36 PM