Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Aug 31 , 2024 | 05:40 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సంచలన విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్‌కి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‌ను డెకాయిట్ అని ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సంచలన విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్‌కి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‌ను డెకాయిట్ అని ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం) తెలంగాణ భవన్లో హరీష్‌రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... బూతులు మాట్లాడటంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌కు తానేమి వెనుకబడలేనని నిరూపించాలనుకున్నావా ఉత్తమ్..? అని ప్రశ్నించారు.పేరేమో ఉత్తమ్ కుమార్.. మాట తీరేమో మూసీ ప్రవాహం అని హరీష్‌రావు విమర్శలు చేశారు.
ప్రక్షాళన చేయాలి..
‘‘రేవంత్ నోటితో పాటూ ఉత్తమ్ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంది. జలయజ్ఞంలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టి ఇష్టమున్నట్లు ప్రాజెక్టుల ఆంచనా విలువలను పెంచేసి, ఏజెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా సర్వే, డిజైన్ అడ్వాన్స్‌లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచి తెలంగాణను డెకాయిట్ చేసింది ఎవరు ? వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరు ? మీరు కాదా ఉత్తమ్? ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి తట్ట మట్టి ఎత్తకుండానే రూ.40 వేల కోట్లకు పెంచుకున్న సంగతిని మరచిపోయావా ఉత్తమ్..? ఇగో మీ కాంగ్రెస్ డెకాయిట్ గురించి ఇప్పటికే ఎన్నోసారు చెప్పి ఉన్నా. మళ్లీ గుర్తు చేస్తున్నాను’’ అని హరీష్‌రావు తెలిపారు.
అడ్వాన్స్‌లు దండుకున్నారు..
‘‘తుమ్మిడిహట్టి బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రాతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే ప్రాజెక్టు పనులని 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసి తలను వదిలేసి తోక దాకా ఏక కాలంలో పనులని ప్రారంభించి అడ్వాన్స్‌లు దండుకున్నది మీరు కాదా? 2010లో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ని రూ.40,300 కోట్లకు సవరించి పంపింది నువ్వు మంత్రిగా ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా’’ అని హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.