Akkineni Nagarjuna: హీరో నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ
ABN , Publish Date - Oct 07 , 2024 | 01:28 PM
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. రేపు (మంగళవారం) పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్ట్ తెలిపింది. రేపు కోర్ట్‌కు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని రేపే నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్ట్ రేపటికి వాయిదా వేసింది.
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా
కాగా.. తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా.. తాజాగా హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేయగా.. బీఆర్‌ఎస్ మహిళా నేతలు సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రధాన తారలంతా మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక మాద్యమాల్లో పోస్టులు చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం సినీ పరిశ్రమలోని వ్యక్తులను టార్గెట్ చేయడం సరికాదని పలువురు సినీ రంగ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అసలేం జరిగింది..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావిస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున, సమంతతో పాటు సినీ రంగ ప్రముఖులంతా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. మరోవైపు కేటీఆర్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించినందుకు చింతిస్తున్నట్లు కొండా సురేఖ ప్రకటించినప్పటికీ.. ఆమె వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరో నాగార్జున తన పరువుకు భంగం కలిగిందంటూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పిటిషన్‌పై కోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here