TG High Court: లా కోర్సులపై హైకోర్టులో విచారణ.. కారణమిదే..?
ABN , Publish Date - Jul 09 , 2024 | 10:17 PM
తెలంగాణలో లా కోర్సులకు సకాలంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయవాది భాస్కర్ రెడ్డి దాఖలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో లా కోర్సులకు సకాలంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయవాది భాస్కర్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ జూన్‌లో ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారని పిటీషనర్ తెలిపారు. గత నెలలోనే ఫలితాలు విడుదల చేశారని కోర్టుకు పిటీషనర్ చెప్పారు. కౌన్సిలింగ్ మాత్రం సకాలంలో నిర్వహించడం లేదని పిటీషనర్ కోర్టుకు వివరించారు.
గతేడాది నవంబర్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారని ధర్మాసనం దృష్టికి పిటీషనర్ తీసుకెళ్లారు. దీనివల్ల లా చదవాలనుకున్న విద్యార్థులు 8నెలల సమయం కోల్పోతున్నారని పిటీషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కౌంటర్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బార్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఉన్నత విద్యా మండలి అధికారులు పేర్కొన్నారు. కళాశాలల్లో లా కోర్సులపై పరిశీలనకు దాదాపు 6 నెలల సమయం పడుతుందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోర్టుకు తెలిపింది. తుది విచారణను హైకోర్టు 16వ తేదీకి వాయిదా వేసింది.