TG GOVT: హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Dec 03 , 2024 | 08:40 PM
మూసీ రివర్ బెడ్‌లో నివసిస్తున్న వారికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.మూసీని అభివృద్ధి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్: భాగ్యనగర అభివృద్ధిపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నగర బ్రాండ్ ఇమేజ్ కాపాడుతున్నామని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దాదాపు రూ. 7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వాటర్ లాగింగ్ పాయింట్స్‌ను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు రహదారులపై నీరు నిల్వకుండా వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. మూసీ రివర్ బెడ్‌లో నివసిస్తున్న వారికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని వివరించారు. మూసీని అభివృద్ధి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో దశల వారీగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్ గ్రోత్ రేట్ పెరిగింది: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ గ్రోత్ రేట్ 19.34శాతం పెరిగిందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని వివరించారు. పదేహేన్నేళ్లలో తెలంగాణ జీఎస్డీపీ గ్రోత్ రేట్ 11శాతం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 250కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తుల సంఖ్య 467 ఉందని చెప్పారు. వారి వల్ల కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. హోమ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య హైదరబాద్‌లో ఎక్కువ అని చెప్పారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరగడమే అందుకు కారణమని అన్నారు. హైదరాబాద్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని వివరించారు. భవనాలు, లే ఔట్స్ సరళీకృత అనుమతుల కోసం కొత్తగా బిల్డింగ్ నౌ అనే కొత్త విధానం తెస్తున్నామన్నారు. ప్రస్తుతం హై రైజ్ బిల్డింగ్స్ డ్రాయింగ్ ఆటో స్క్రూటినీలో ఆలస్యం అవుతుందన్నారు.
అందువల్ల భవనాలు, లే ఔట్ అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుందని చెప్పారు. కొత్త విధానంలో ఆ సమస్య తీరుతుందని అన్నారు. ఈ అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన స్క్రూటినీ సాఫ్ట్ వేర్ కలిగి ఉంటుందన్నారు.. పదిహేను రోజుల్లో అనుమతులు, పది రోజుల్లో అక్యుపై సర్టిఫికెట్ అందించే ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఫిబ్రవరి1నుంచి అమలు చేస్తామన్నారు. ఇక హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖ భూముల కోసం కేంద్రం అనుమతి పొందామని గుర్తుచేశారు. రూ. 5619 కోట్లతో రెండు ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మించబోతున్నామని అన్నారు. రూ.1487కోట్లతో 5.32కిలో మీటర్ల పొడవుతో ప్యారడైజ్ నుంచి డైరీ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ. 5560కోట్లతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ చేపడుతున్నామని అన్నారు. త్వరలో ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ పనులు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.