KTR: కాంగ్రెస్ సర్కారులో గురుకులాలు అలా మారాయి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
ABN , Publish Date - Dec 14 , 2024 | 09:43 AM
విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. విద్యార్థులు గురుకులాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో ఆవేదనకు గురి చేశారని చెప్పారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రి బెడ్లను ఎక్కించారని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్లుగా ఇప్పుడు గురుకులాల బాటపట్టారని చెప్పారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు .. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు-పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపాలని అన్నారు. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు-గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినాలని చెప్పారు. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి- గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయాలని సూచించారు.ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న వరుస మరణాలు, విషాద ఘటనల నేపథ్యంలో అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు గురుకుల బాట పేరిట బీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నవంబర్ 30 నుంచి డిసెంబరు 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకుగాను ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు.
ఆయనతోపాటు సభ్యులుగా ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారామ్ యాదవ్, వాసుదేవరెడ్డి ఈ కమిటీలో ఉన్నారు. బాలికల విద్యా సంస్థలను పార్టీ తరఫున మహిళా నాయకులు సందర్శించారు. అక్కడి స్థితిగతులు, సౌకర్యాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. కమిటీ గుర్తించిన సమస్యలు, పరిష్కారాలను ప్రభుత్వానికి సూచించి ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు. కమిటీ నివేదికలోని అంశాలను శాసనసభలో లేవనెత్తానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Allu Arjun: జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ ఏమన్నారంటే...
Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
Hyderabad: సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..
For Telangana News And Telugu News