Share News

KTR:సీఎం రేవంత్ ఆ కేసులు వాపస్ తీసుకోవాలి

ABN , Publish Date - Dec 12 , 2024 | 02:31 PM

రేవంత్ రెడ్డి అనే అహంకారితో గిరిజన, దళిత రైతులు నెల రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తనమీద దాడి జరగలేదని స్థానిక కలెక్టర్ హుందాగా వ్యవహరించారని చెప్పారు. రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా కలెక్టర్ దాడి జరగలేదని చెబుతున్నారని అన్నారు.

KTR:సీఎం రేవంత్ ఆ కేసులు వాపస్ తీసుకోవాలి

నందినగర్: లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి.. రైతులను విడుదల చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ( గురువారం) నందినగర్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఈగోకు పోవటంతో.. గిరిజన రైతుల ప్రాణాలకు మీదకొచ్చిందని అన్నారు.


జైల్లో ఉన్న హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే.. కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా ఉంచటం దారుణమని అన్నారు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని అంబులెన్స్‌లో తీసుకురాకుండా.. బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకురావటం అమాననీయమని చెప్పారు. తీవ్రవాదులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధన ఉందని.. రైతులకు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బేడీల అంశాన్ని గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.


ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని .. కేసులు వాపస్ తీసుకునేలా రేవంత్‌రెడ్డిను మందలించాలని అన్నారు. లగచర్ల రైతులు జైల్లో మగ్గుంతుంటే.. రేవంత్ జైపూర్ విందులు, వినోదాల్లో మునుగుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రెస్టేజ్‌కి పోయి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. అదానీ, అల్లుడు కోసం పేదల భూములను రేవంత్ రెడ్డి గుంజుకుంటున్నారని ఆరోపించారు.


రేవంత్ రెడ్డి అనే అహంకారితో గిరిజన, దళిత రైతులు నెల రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.హీర్యానాయక్ , రాఘవేంద్ర, బసప్పకు అనే రైతుల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. తనమీద దాడి జరగలేదని స్థానిక కలెక్టర్ హుందాగా వ్యవహరించారని చెప్పారు. రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా కలెక్టర్ దాడి జరగలేదని చెబుతున్నారని అన్నారు. లగచర్ల రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మానవీయకోణంలో నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ తెలిపారు.


కలెక్టర్‌‌పై దాడి ఎలా జరిగిందంటే..

కాగా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో పోన్ కాల్ చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి సైతం.. ఓ వైపు సురేశ్‌తో మాట్లాడుతూనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు డీజీపీ ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేశ్‌పై ఇప్పటికే అత్యాచారం కేసుతో సహా వివిధ కేసులు సైతం నమోదయ్యాయి. అయితే గతంలో సురేష్‌పై నమోదు అయిన కేసులను తొలగించేందుకు పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది.


పట్నం మహేందర్ రెడ్డికి రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం ఘర్షణల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు.. మరికొందరి ఆదేశాలు కూడా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా ప్రజలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. అంతేకాదు.. కొందరికి డబ్బులు ఇచ్చి మరీ దాడికి ఉసిగొల్పారన్నారు. అధికారులను చంపినా పర్వాలేదని.. రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచరించామని పోలీసులు అన్నారు. నిందితుడు విశాల్‌‌తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందని చెప్పారు.

Updated Date - Dec 12 , 2024 | 02:31 PM