Share News

KTR: రేవంత్ రెడ్డి‌ది నరం లేని నాలుక.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 24 , 2024 | 09:01 AM

రేవంత్ రెడ్డి‌ది నరం లేని నాలుక అని.. ఏదైనా మాట్లాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను భయపెడతున్నారని మండిపడ్డారు.

KTR: రేవంత్ రెడ్డి‌ది  నరం లేని నాలుక.. కేటీఆర్ సంచలన  వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి‌ది నరం లేని నాలుక అని.. ఏదైనా మాట్లాడుతుందని విమర్శించారు. అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని ఆక్షేపించారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తునే ఉంటామని హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)‌లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


రేవంత్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా వెల్లడించారని అన్నారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేయలేదా అని ప్రశ్నించారు. ‘మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా’ అని నిలదీశారు. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా అని అడిగారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారని ప్రశ్నించారు. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్ధాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.


రాష్ట్రంలో నియంత పాలన ..

కాగా.. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగానే పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన నరేందర్‌ రెడ్డి జైల్లో ఉన్నారని అన్నారు. నరేందర్‌ రెడ్డి కోరిక మేరకు జైలు పాలైన 30మంది రైతులకు అండగా ఉంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.


సొంతూరు కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్‌ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తిపై రేవంత్‌ రెడ్డి పగబట్టి, అవమానించి ఆయన ఉసురు తీశారని విమర్శించారు. గత పదేళ్ల తమ పాలనలో ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగాయా అని ఆయన ప్రశ్నించారు. ‘రేవంత్‌ ఇది నీ సొంత సామ్రాజ్యమా...? నువ్వు చక్రవర్తివా? వెయ్యేళ్లు బతకడానికి వచ్చావా?’ అని నిలదీశారు. ప్రజలు అన్ని తప్పులను గమనిస్తున్నారని, శిశుపాలుడికి పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టనుందని కేటీఆర్‌ ఆక్షేపించారు.

Updated Date - Nov 24 , 2024 | 01:22 PM