Share News

Hyderabad: ఆటో డ్రైవర్ల బాధలు కలచివేశాయి: కేటీఆర్..

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:04 PM

మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయామంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆటోడ్రైవర్లు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

Hyderabad: ఆటో డ్రైవర్ల బాధలు కలచివేశాయి: కేటీఆర్..

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇలాగే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. " తెలంగాణకు ఇవాళ రాహుల్ గాంధీ వస్తున్నారు. ఇదే రాహుల్ గాంధీ గతేడాది ఎన్నికల వేళ ఆటోల్లో తిరిగి రాష్ట్ర ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇంటింటికీ సంక్షేమం అని చెప్పారు. అత్తలు, కోడళ్లకు డబ్బులు ఇస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. కానీ దాని వల్ల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డ్రైవర్ల ఆత్మహత్యలు, వారి ఇబ్బందుల గురించిన వివరాలను అసెంబ్లీలో పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మమ్మల్ని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.5వేలు ఇవ్వాలి. ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రభుత్వమే అందించాలి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇన్స్యూరెన్సు కూడా రద్దు చేశారు. మీ కోసం వచ్చిన వాళ్లకు వ్యతిరేకంగా మీరు మాట్లాడటం సరైనది కాదు.


నేను ఇక్కడికి ఆటోలోనే వచ్చాను. డ్రైవరన్న తమ బాధలు చెప్తుంటే ఎంతో ఆవేదన కలిగింది. బీఆర్ఎస్‌కు ఆటో డ్రైవర్ల కెపాసిటీ తెలుసు. మమ్మల్ని ఓడగొట్టడంలో మీ పాత్ర ఉంది. ఇంకా నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరించాలి. ఈ నాలుగేళ్లు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం. అన్ని జెండాలు ఒక్కటై పోరాటం చేయాలి. ఏఐటీయూసీ ప్రభుత్వంతో కలిసి ఉంది, అయినా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు రోడ్డెక్కింది. సీఐటీయూ వంటి సంఘాలూ ఉద్యమాలు చేస్తున్నాయి. కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలి. మా పూర్తి మద్దతు మీకు ఇస్తున్నాం. మా బీఆర్‌టీయూ సంఘంతో కలిసి మీరు చేసే ప్రతి పోరాటంలో తోడుగా ఉంటాం. ఇక్కడికి పోలీసులు కూడా ఎక్కువ మంది రాకుండా కట్టడి చేశారు. పోలీసులూ కష్టాల్లోనే ఉన్నారు. వాళ్లూ సమస్యలతో రోడ్డెక్కారు. పోలీసులు డ్యూటీ చేయాలి, కానీ పేదల పట్ల కనీసం ఆలోచన చేయాలి. పోలీసులను సీఎం నమ్మడం లేదు. అందుకే సచివాలయంలో స్పెషల్ పోలీసులను తీసేసి బెటాలియన్ దింపారు" అని చెప్పారు.


కాగా, మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయామంటూ ఇందిరా పార్కు వద్ద ఆటోడ్రైవర్లు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, తాము నష్టపోయినందుకు నెలకు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటూ ఆటోడ్రైవర్లు ధర్నా చేపట్టారు. అలాగే హైదరాబాద్‌లో కొత్తగా 20 వేల ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, మీటర్ చార్జీలు సైతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది.


కేటీఆర్‌కు చేదు అనుభవం..

మహాధర్నా చేస్తున్న ఆటోడ్రైవర్లకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, ముఠా గోపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్ కంటే ముందుగా ముఠా గోపాల్ అక్కడికి చేరుకున్నారు. అయితే ధర్నాలో పాల్గొనాలని తాము రాజకీయ నాయకులను పిలవలేదని, కొంతమంది ధర్నాను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని డ్రైవర్లు మండిపడ్డారు. తమను ప్రశాంతంగా ధర్నా చేసుకోనివ్వాలని చెప్పడంతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అలాగే కేటీఆర్ విషయంలో వారు ఇలాగే స్పందించారు. "మిమ్మల్ని రమ్మని ఎవరు పిలిచారు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఊబర్, ఓలాలు వచ్చాయి. మీ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లకు ఏం చేశారు? చలానాలు పెంచారు, వందల కేసులు పెట్టారు. కొత్త ఆటోలకి పర్మిషన్లు ఇవ్వలేదు. ఏ మెుహం పెట్టుకొని వచ్చి మాట్లాడాలని చూస్తున్నారు" అని డైవర్లు ప్రశ్నించారు. దీంతో ఆయన వారిని సముదాయించి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఖండాలుదాటిన ప్రేమ.. ఒక్కటి కాబోతున్న కోనసీమ అబ్బాయి,కెనడా అమ్మాయి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 03:15 PM