Balamuri Venkat: ఆ విషయంపై కేటీఆర్ చర్చకు రెడీనా.. బలమూరి వెంకట్ సవాల్
ABN , Publish Date - Jul 09 , 2024 | 05:25 PM
విద్యార్థి, నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ (MLC Balmuri Venkat) హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం సమస్యలు కూడా వినలేదని, తమ పాలనలో అందరి సమస్యలు విని పరిష్కారిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్: విద్యార్థి, నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ (MLC Balmuri Venkat) హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం సమస్యలు కూడా వినలేదని, తమ పాలనలో అందరి సమస్యలు విని పరిష్కారిస్తున్నామని తెలిపారు. జీవో 46,317 సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ వేసి సమస్య పరిష్కారం చేస్తున్నామని వివరించారు. గతంలో 1-8-2023 టెట్ నోటిఫికేషన్ వచ్చిందని.. 15-09-2023 పరీక్ష నిర్వహించారని చెప్పారు. గత ప్రభుత్వం 6-9-2023 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని అన్నారు. ఈరోజు(మంగళవారం) గాంధీభవన్‌లో బలమూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు.
‘‘20-11-2023 పరీక్ష అన్నారు ఎన్నికలు రాగానే పరీక్షలు పెట్టలేదు.5500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మా ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీతో 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటించాము. ఇప్పుడు టెట్ పరీక్ష కోసమే డీఎస్సీని పోస్ట్ పోన్ చేశాం. ఉద్యోగాలు ఇవ్వమంటారా పోస్ట్ పోన్ చేయాలా మీరే చెప్పాలి. మాజీ మంత్రి కేటీఆర్ ఏ పరీక్ష ఎప్పుడు పెట్టాలో అసలు మీకు క్లారిటీ ఉందా..? గతానికి ఇప్పటికీ పోస్టులు పెంచింది నిజం కాదా...? మీరు డీఎస్సీ 5,500 పోస్టులు ఇస్తే మేము 11,000 పోస్టు లు రిలీజ్ చేశాం. పదేళ్ల మీ పాలనలో ఒక్క గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు. పది, ఇంటర్, ఇలా ఏ పరీక్ష పెట్టిన పేపర్ లీకేజీలు చేసిన మీరా మా గురించి మాట్లాడుతున్నారు.
జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మిగతా డీఎస్సీ పోస్టులను భర్తీ చేస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మిమ్మలని ఆగం చేస్తున్నారు మీరు ఆగం కాకండి. బీఆర్ఎస్ నేతలకు పదవులు పోయాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి గురించి మేము ఆలోచన చేస్తాం. పదేళ్ల కాలంలో మీరు ఏమి చేశారో చర్చ పెట్టండి. మేము ఆ చర్చకు రెడీ..పదేళ్లలో మీరు చేసిన పనులపై మీ చెల్లె జైల్లో నుంచి బయటికి వచ్చాక మండలిలో చర్చ పెట్టండి చర్చకు మేము రెడీ’’ అని బలమూరి వెంకట్ సవాల్ విసిరారు.