Share News

KTR : కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న వాల్మీకి స్కాం

ABN , Publish Date - Aug 25 , 2024 | 12:32 PM

కర్ణాటక వాల్మీకి స్కాం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కాంలో కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పదించారు. కర్ణాటక కాంగ్రెస్‌కే కాదు.. తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ముచ్చెమటలు పట్టిస్తుందని విమర్శలు చేశారు.

 KTR : కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న వాల్మీకి స్కాం
KTR

హైదరాబాద్: కర్ణాటక వాల్మీకి స్కాం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కాంలో కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) స్పదించారు. కర్ణాటక కాంగ్రెస్‌కే కాదు.. తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా వాల్మీకి స్కాం ముచ్చెమటలు పట్టిస్తోందని విమర్శలు చేశారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి విషయం బయటకు రాకుండా ఆపుతున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు.


ఆ డబ్బులు అక్రమంగా దారి మళ్లాయి..

ఈరోజు(ఆదివారం) తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఆ మబ్బుల నాలుగు రోజుల్లో వెళ్లిపోతాయని ఆక్షేపించారు. గవర్నమెంట్ డబ్బులు పార్లమెంట్ ఎన్నికల ముందు రూ.180కోట్లు అక్రమంగా దారి మళ్లాయని ఆరోపించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆ రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నారని వివరించారు. హైదరాబాద్‌లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్‌లకు రూ.45 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని కేటీఆర్ ఆరోపణలు చేశారు.


వాల్మీకి కార్పొరేషన్ సూపరిండెంట్ సూసైడ్..!!

వాల్మీకి స్కాంపై విచారణ మొదలు అవ్వగానే దానికి సంబంధించిన కార్పొరేషన్ సూపరిండెంట్ సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. బ్యాంక్ అధికారులతో సహా 11మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు. కర్ణాటక నుంచి డబ్బు అక్రమంగా తెలంగాణలోని ఏ అకౌంట్‌లకు వచ్చింది.. ఆ అకౌంట్‌లు ఎవరివి? అని ప్రశ్నించారు. ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతుందని విమర్శలు చేశారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఈ డబ్బులనే ఖర్చు చేసినట్లు అనిపిస్తోందని ఆరోపణలు చేశారు. నాలుగున్నర కోట్లు ఓ బిజినెస్ కంపెనీకి నేరుగా ట్రాన్స్ ఫర్ అయినట్లు ఆధారాలు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.


రాహుల్ గాంధీ నోరు విప్పాలి..?

‘‘పార్లమెంట్ ఎన్నికల సమయంలో బంగారం షాపులు, బార్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. వారికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంటి...? ఇవన్ని బయటకు రావాలి. సిద్ధరామయ్యను తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్ఖిహొలీ అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న బంధం వాల్మీకి స్కామేనా? ఈ స్కామ్‌లో భారీ మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వాటాలు వచ్చాయని తెలిసినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది. అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు..? ఈ అంశంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నోరు, గుట్టు విప్పాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Updated Date - Aug 25 , 2024 | 12:55 PM