Kunamneni Sambasiva Rao: పేద ప్రజలకు అండగా కమ్యూనిస్టు పార్టీ
ABN , Publish Date - Sep 20 , 2024 | 11:08 PM
తెలంగాణకు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా: తెలంగాణకు స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చిందని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్ సమైక్యతదినం,రేవంత్ ప్రజా పాలన ఎవరికోసం, నాయకులు విలీనం పేరు ఎందుకు చెప్పడం లేదని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.
నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు చనిపోతే తెలంగాణ వచ్చిందని వివరించారు. చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య, మొహిద్దిన్, గద్దర్ వీళ్లంతా కమ్యూనిస్టులేనని.. తెలంగాణ కోసం వీరు ప్రాణాలర్పించారని తెలిపారు. కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా చరిత్రను అనుచాలని చూస్తే కమ్యూనిస్టుల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని హెచ్చరించారు. డిసెంబర్ 26నాటికి తమ పార్టీకి 100 ఏళ్లు నిండుతాయని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
కేసీఆర్ పార్టీ ఇవాళ ఉంటుందో లేదో తెలియదు కానీ కమ్యూనిస్టు పార్టీ మాత్రం కచ్చితంగా ఉంటుందని ఉద్ఘాటించారు. బస్తీమే సవాల్ అని కుస్తీలు పట్టుకోడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని కౌశిక్‌రెడ్డి,అరికెపూడి గాంధీ దీనికి ఉదాహరణ అని చెప్పారు. అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీను తట్టుకోలేక గ్రామాలను వదిలి దొరలు నవాబులు పటేళ్లు వెళ్లిపోయారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు.