Minister Prabhakar: కిషన్‌రెడ్డి అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ విసుర్లు
ABN , Publish Date - Nov 16 , 2024 | 07:02 AM
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజకీయ పార్టీ ఏదైనా సరే విమర్శలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనుమతిస్తున్నామని అన్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని అధికారులపై దాడులు చేస్తే ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలో రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... సిరిసిల్ల జిల్లా టెక్స్‌టైల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలిపారు. రూ. 2 లక్షల పైన ఉన్న వారికి త్వరలోనే రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. డిఫాల్టర్‌లకు ధాన్యం ఇవ్వడం లేదని.. గత బకాయిలు చెల్లించాలని చెప్పారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు.
రైతులు సన్న ధాన్యం పండిస్తున్నారని వివరించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయి ఉండి అధికారిని కొట్టడం తప్పే..కానీ అరెస్టు చేస్తారా అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ లాగా తాము రోజుకో మాటమాట్లాడటం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
అధికారులపై దాడులు చేస్తే సహించం
కాగా.. అధికారులపై దాడులు చేస్తే ఎంతమాత్రం సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాం. రాజకీయ పార్టీ ఏదైనా సరే విమర్శలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనుమతిస్తున్నాం. దాన్ని అవకాశంగా తీసుకొని అధికారులపై దాడులు చేస్తే ఊరుకోబోం’’ అని వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో పరిశ్రమ పెట్టడం ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసన తెలపవచ్చని, ఇందిరా పార్కు వద్ద ధర్నా, ర్యాలీ, దీక్షలు చేయవచ్చని అన్నారు. అధికారులపై దాడులు చేస్తే మాత్రం చట్టప్రకారంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మల్లన్నసాగర్, మిడ్ మానేరు బాధితులను గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో తనకు తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.
కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు...
కొడంగల్‌లో కలెక్టర్‌పై దాడి విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కలెక్టర్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా ఏం చేయాలో ప్రభుత్వానికి కేంద్రమంత్రి సూచించాలన్నారు. అనంతరం.. సీఎం రేవంత్ ఈ నెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సిరిసిల్లలో నేత కార్మికుల కోసం మనోధైర్య ర్యాలీ నిర్వహిస్తామని పొన్నం తెలిపారు. నేతన్నల సమస్యలు తెలుసుకోవడానికి ప్రభుత్వం తరఫున సిరిసిల్లలో ఒకరోజు గ్రీవెన్స్ సెల్(ఫిర్యాదుల స్వీకరణ) నిర్వహిస్తామన్నారు. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పలు పథకాలను అందుబాటులోకి తెచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. సీఎం 20న జిల్లాకు రానున్న నేపథ్యంలో అనేక కార్యక్రమాలు ముందుకు వస్తాయని భరోసా ఇచ్చారు. బతుకమ్మ చీరల స్థానంలో మహిళా సంఘాలకు అందించే చీరల ఆర్డర్లు త్వరలోనే ఇస్తామన్నారు.