Share News

MP Raghunandan Rao: ఎవ్వరినీ వదలను.. ఆ ప్రచారం చేసింది బీఆర్ఎస్ నేతలే..

ABN , Publish Date - Oct 01 , 2024 | 06:00 PM

అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు కండువా కప్పానని, దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.

MP Raghunandan Rao: ఎవ్వరినీ వదలను.. ఆ ప్రచారం చేసింది బీఆర్ఎస్ నేతలే..

హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), తనపై తప్పుడు పోస్టులు పెట్టింది బీఆర్ఎస్ నేతలేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఆరోపించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు కండువా కప్పానని, దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారం చేశారని రఘునందన్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టి కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. హైదరాబాద్‌ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందర్ రావు మాట్లాడారు.


ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.."తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధంపైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టింది. ఒక తమ్ముడిగా మంత్రి సురేఖను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. అలాంటి దండను ప్రధాని మోదీ వచ్చినప్పుడూ వేశా. దీనిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. దీనిపై పోస్టులు పెట్టిన వారిని ఒక లాయర్‌గా కోర్టుకు ఈడుస్తా. పోస్టు పెట్టిన అకౌంట్ డీపీలో హరీశ్ రావు, కేసీఆర్ ఫొటో ఉంది. ఆ పార్టీ నేతలకు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా?. తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు మీ వాళ్లు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే ఫిర్యాదు చేయండి. ట్రోలింగ్‌ చేసిన వారి వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా.


మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లాలని నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వచ్చి నాకు శాలువా కప్పారు. ఇంత సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు. కేటీఆర్, హరీశ్ రావు దీనిపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసి క్షమాపణ చెప్పాలి. హరీశ్ రావు తన ఫొటోలు వాడుకుని తప్పుడు ప్రచారం చేశారని అనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదు. మహిళల మీద ఆ పార్టీకి గౌరవం లేదు. తెలంగాణ తొలి కేబినెట్‌లో మహిళలకు బీఆర్ఎస్ చోటే ఇవ్వలేదు. వేలాది మంది సమక్షంలో జరిగిన కార్యక్రమాన్ని బూతద్దంలో చూపించి విమర్శలు చేసే వారిని చూస్తే బాధనిపిస్తోంది. నా వల్ల అక్క సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Hyderabad: హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్.. మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు పెడితే..

Hyderabad: అశ్లీల వీడియోలు చూస్తే ఇకపై జైలుకే.. అలాంటి వారిపై కన్నేసిన నిఘా సంస్థలు..

Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 06:02 PM