Share News

Mynampally: హరీష్‌రావుని వదిలిపెట్టేది లేదు.. మైనంపల్లి హనుమంత రావు మాస్ వార్నింగ్

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:06 PM

మాజీ మంత్రి హరీష్ రావునీ వదిలిపెట్టేది లేదని మైనంపల్లి హనుమంత రావు(Mynampally Hanumanth Rao) మాస్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుముకుంట నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంత రావు మీడియా సమావేశం నిర్వహించారు.

Mynampally: హరీష్‌రావుని వదిలిపెట్టేది లేదు..  మైనంపల్లి హనుమంత రావు మాస్ వార్నింగ్
Mynampally Hanumanth Rao

సిద్దిపేట జిల్లా: మాజీ మంత్రి హరీష్ రావునీ వదిలిపెట్టేది లేదని మైనంపల్లి హనుమంత రావు(Mynampally Hanumanth Rao) మాస్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుముకుంట నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంత రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జులు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ... తాను వారానికోసారి సిద్దిపేటలో పర్యటిస్తానని, ప్రతి గ్రామంలో తిరుగుతానని చెప్పారు. నియోజకవర్గానికి పూర్తి సమయం కేటాయిస్తానని తెలిపారు.


లోకల్ బాడి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుని లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. ఆగస్టు లోనే రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే రెండు విడతలు రుణమాఫీని రైతుల ఖాతాల్లో వేసినట్లు గుర్తుచేశారు. ఈ విషయంపై హరీష్‌రావు రాజీనామాకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. హరీష్ రావు నీ తిరిగి తోటపల్లికి పంపే వరకు తాను నిద్ర పోనని హెచ్చరించారు. రుణమాఫీ చేసినట్టు మిగిలిన పథకాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు చేస్తారని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం చింతమడకలో ఇష్టం వచ్చినట్లుగా రూ.10లక్షలు పంచిందని.. మరీ మిగతా గ్రామాల్లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిద్దిపేట తరహాలో మిగతా నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తామని మైనంపల్లి హనుమంత రావు పేర్కొన్నారు.


కేంద్రమంత్రిని కలిసిన మల్లు రవి

ఢిల్లీ: తెలంగాణ అభివృద్ధిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కలిశానని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. వరంగల్ , రామగుండం, ఆదిలాబాద్ , కొత్తగూడెంలో కొత్త ఎయిర్ పోర్ట్‌లకు నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు పెట్టామని వివరించారు. శుక్రవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి ఎలాంటి డీపీఆర్ ఇంకా డాక్యుమెంట్స్ కావాలో తీసుకువస్తానని అన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఎన్.ఐటీ తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రైల్వే మంత్రిని కలిసి గద్వాల - మాచర్ల - నంద్యాల రైల్వేలైన్లు పూర్తి చేయాలని కోరానని అన్నారు. రెవెన్యూ రాదని లైన్లు పూర్తి చేయడం లేదని చెప్పారు. జడ్చర్ల - నంద్యాల వరకు రైల్వేలైన్లు పూర్తి చేయాలని కోరారు. 2006 నుంచి ఈ లైన్ పెండింగ్‌లో ఉందని తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని కోరామని చెప్పారు. రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరానని మల్లు రవి అన్నారు.


కేసీఆర్ ఊహల్లో బతుకుతుండు: రాజగోపాల్ రెడ్డి

మరోవైపు.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) విమర్శించారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ‘‘కేసీఆర్ సభకు వస్తే మజా ఉంటుంది. కరెంట్‌పై డిస్కషన్‌లో కేసీఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేది. ఆయన ఓడిపోయిన ఇంకా జాతిపిత అనుకుంటున్నాడు. కేసీఆర్ ఊహల్లో బతుకుతుండు. పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళ్తారు. మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా. పార్టీ మారి ఉండాల్సింది కాదు. హౌస్‌లో సస్పెన్షన్‌లు చేయకపోవడం మా ప్లాన్. ఎల్ఓపీగా కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతల పరిస్థితి తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుంది. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇద్దరిలో ఎవరికి ఎల్ఓపీ ఇచ్చిన బీఆర్ఎస్ ఆగం అవుతది. హరీష్‌రావు మంచి అనుభవం ఉన్న నేత కానీ ఆయనకు ఇవ్వరు. కేటీఆర్‌కు అవగాహన లేదు’’ అని రాజగోపాల్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.

Updated Date - Aug 02 , 2024 | 05:11 PM