Share News

Harish Babu: రేవంత్ ప్రభుత్వం ఆకాశంలో మేడలు కడుతోంది

ABN , Publish Date - Aug 10 , 2024 | 05:40 PM

రేవంత్ ప్రభుత్వం గ్రామ పరిపాలన గాలికొదిలేసి, ఆకాశంలో మేడలు కడుతోందని సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ శాసన సభ్యులు పాల్వాయి హరీష్‌బాబు ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పాలని హెచ్చరించారు. కొడంగల్, వికారాబాద్, నారాయణపేట్‌కు మాత్రమే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

Harish Babu: రేవంత్ ప్రభుత్వం  ఆకాశంలో మేడలు కడుతోంది
Palvai Harish Babu

హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం గ్రామ పరిపాలన గాలికొదిలేసి, ఆకాశంలో మేడలు కడుతోందని సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ శాసన సభ్యులు పాల్వాయి హరీష్‌బాబు (Palvai Harish Babu) ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారా, ఇంకేమైనా చక్కబెట్టడానికి పోయారనేది తెలియదని ఆరోపించారు. శనివారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ... రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పాలని హెచ్చరించారు. కొడంగల్, వికారాబాద్, నారాయణపేట్‌కు మాత్రమే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. విద్యా వలంటీర్లను కొడంగల్‌కు మాత్రమే పరిమితం చేస్తున్నారని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌కు మాత్రమే ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని గుర్తించుకోవాలని పాల్వాయి హరీష్‌బాబు హితవు పలికారు.


ప్రపంచ ఆదివాసీల కార్యక్రమాలను నిన్ననే ప్రభుత్వం ఊరూర జరుపుకుంది, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. ఆదివాసీల గ్రామాలకు నేటికీ రహదారులు లేవని అన్నారు. కొమురం భీం జిల్లాలో గిరిజన మహిళ డెలివరీ కోసం, పురిటి నొప్పులతో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని పాల్వాయి హరీష్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు.

వాగు దాటగానే దారి మధ్యలోనే డెలివరి అవడంతో పుట్టిన బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గిరిజన బతుకులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయని వివరించారు. గిరిజన గ్రామాలకు రహదారులు లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రికి వెళ్లటానికి కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని పాల్వాయి హరీష్‌బాబు అన్నారు.


గిరిజన బతుకులు ఇలా ఉంటే మంత్రి సీతక్క మాత్రం గిరిజన గ్రామాలకు నాలుగేళ్లలో తారు రోడ్లు వేస్తామని చెబుతున్నారని ఇది త్వరగా సాధ్యం కావాలని కోరుకున్నారు. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని చెప్పారు. పంచాయతీల్లో సర్పంచులు లేరు, పంచాయతీలన్ని గ్రామ కార్యదర్శులకు అప్పజెప్పారని పాల్వాయి హరీష్‌బాబు విమర్శలు చేశారు. తొమ్మిది నెలల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గ్రామాలకు ఒక్క రూపాయి నిధులను ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.


సీతక్క మీద చాలా నమ్మకం ఉండేదని, కానీ గ్రామాల్లో పరిస్థితులు చూస్తుంటే సీతక్కపై ఆ నమ్మకం కోల్పోయేలా ఉందని అన్నారు. ప్రభుత్వం గ్రామ పరిపాలన గాలికొదిలేసి, ఆకాశంలో మేడలు కడుతోందని విమర్శించారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎటు పోతుందో తెలియడం లేదని పాల్వాయి హరీష్ బాబు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులంతా సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేశారని పాల్వాయి హరీష్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 10 , 2024 | 05:48 PM