Share News

Rakesh Reddy: ఉద్యోగాల క్యాలెండర్ కాదు.. ఉత్తుత్తి క్యాలెండర్

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:21 PM

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు లేవని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy) విమర్శించారు. ఉద్యోగాల క్యాలెండర్ కాదు...ఉత్తుత్తి క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు.

Rakesh Reddy: ఉద్యోగాల క్యాలెండర్ కాదు.. ఉత్తుత్తి క్యాలెండర్
Rakesh Reddy

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు లేవని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy) విమర్శించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో రాకేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగాల క్యాలెండర్ కాదు...ఉత్తుత్తి క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు నవ్వుకుంటున్నారని దెప్పిపొడిచారు.


ప్రజలను అవసరానికి వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదని విమర్శించారు. ప్రజలను ముంచడంలోను కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని చెప్పారు. యువతను ఎన్నికల సమయంలో ఊరు, వాడ తిప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు యువతను కేసులు పెట్టి పోలీసు స్టేషన్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీవో46 భాదితులు ప్రజా భవన్‌కు వెళ్తే అర్ధరాత్రి వారిని కొట్టి అరెస్టు చేశారని.. ప్రజా పాలన అంటే ఇదేనా అని ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రశ్నించారు.


యువతను మోసం చేశారు: కేటీఆర్

మరోవైపు.. పోరాటాలు తమకు కొత్తేం కాదని.. కాంగ్రెస్‌ నేతలు బూతులు తిట్టినా, అవమానించినా ప్రజా సమస్యలపై సర్కారును నిలదీస్తూనే ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్‌ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానంపై అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతాం. వదిలిపెట్టం.. మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం. నిలదీస్తూనే ఉంటాం’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.


జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌..

తన అరెస్టుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు. ‘ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు సున్నా. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. మరోసారి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి యువతను కలిసి మీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో చెప్పండి’ అంటూ మరో పోస్టులో రాహుల్‌ గాంధీని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ అశోక్‌నగర్‌కు వచ్చి యువతతో మాట్లాడిన వీడియోను షేర్‌ చేశారు.

Updated Date - Aug 04 , 2024 | 03:54 PM