Share News

TG Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ..

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:18 AM

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ(శనివారం) రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన పలు పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.

TG Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ..

హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల(Telangana local body elections)కు సంబంధించి ఇవాళ(శనివారం) రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన పలు పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమిషనర్ పార్థసారథి వారితో కూలంకశంగా చర్చిస్తారు. ఇప్పటికే వార్టుల వారీగా ఓటర్ల జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆయన స్వీకరించనున్నారు.


రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయింది. ఈ సమావేశంలో వాటి ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర కీలక అంశాలపై రాజకీయ పార్టీలతో ఆయన చర్చించనున్నారు. ఓటర్ జాబితా తయారీ అనంతరం ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.


ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలా సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌ నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని చెప్పారు. ముందుగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.


శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వమైనవని పార్థసారథి చెప్పారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ వంటి ప్రక్రియలను తక్షణమే పూర్తిచేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 6న ముసాయిదా ఓటరు జాబితా వెలువరించి అభ్యంతరాలను స్వీకరించి 21న తుది ఓటరు జాబితా విడుదల చేయాలని చెప్పారు. జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ముందుగానే సరి చూసుకోవాలన్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల సంఖ్య దాటితే అదనపు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

TG News: అర్ధరాత్రి పబ్బులు, బార్‌లల్లో దాడులు.. డ్రగ్ టెస్టులు నిర్వహించగా

Road Accident: బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం..

Updated Date - Aug 31 , 2024 | 11:24 AM