Share News

Dharani Portal : ధరణి అర్జీలకు మోక్షం.. పెండింగ్‌ దరఖాస్తులపై నేటి నుంచి స్పెషల్‌ ఫోకస్...

ABN , Publish Date - Nov 28 , 2024 | 06:35 PM

పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిశీలించి జీరో స్టేజికి తీసుకురావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ ఆదేశించారు. దరఖాస్తులు వేగవంతంగా క్లియర్‌ చేసేందుకు ఎమ్మార్వోలకు అదనంగా లాగిన్‌లు ఇచ్చారు. రోజుకు వంద చొప్పున పెండింగ్‌ దరఖాస్తులు పరిశీలించాలని లక్ష్యం విధించారు.

Dharani Portal : ధరణి అర్జీలకు మోక్షం.. పెండింగ్‌ దరఖాస్తులపై నేటి నుంచి స్పెషల్‌ ఫోకస్...

హైదరాబాద్: ధరణి పెండింగ్‌ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ (గురువారం) అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్‌మిత్తల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లక్షకు పైగా పెండింగ్‌లో అర్జీలు ఉన్నాయని వెంటనే పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తహసీల్దార్ స్థాయి అధికారులు స్వీకరించాలని అన్నారు.


అనంతరం ఆర్డీఓ స్థాయి అధికారి అర్జీలను వెరిఫై చేయాలని ఆదేశించారు. ఎమ్మార్వో , ఆర్డీఓలు పంపిన వివరాల ఆధారంగా అర్జీలను అడిషనల్ కలెక్టర్ ఆమోదించవచ్చని, తిసస్కరించవచ్చని తెలిపారు. ఫైనల్‌గా కలెక్టర్ తుది నిర్ణయం తర్వాత అడిషనల్ కలెక్టర్ ఆమోదించాలని సూచించారు.


భారీగా పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య..

గతంలో అన్ని మాడ్యూల్స్ కలెక్టర్లే చేయడంతో.. ఆ పనిభారంతో ఆప్లికేషన్లు పెండింగ్‌లో ఉండేవని చెప్పారు. ఇప్పుడు వారికి పని తగ్గించి.. అందులో కొన్ని బాధ్యతలు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఆర్డీవోలకు అప్పగించారు. ప్రభుత్వం వచ్చాక 3 సార్లు స్పెషల్ డ్రైవ్‌లు.. అయినా పెండింగ్ ఆప్లికేషన్లు క్లియర్ కాలేదని అన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో దాదాపుగా అన్నీ రిజెక్ట్ చేసుకుంటూ పోయారన్నారు.. ఆ తర్వాత మళ్లీ అప్లై చేసుకోవడంతో పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతుందని చెప్పారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రిలో ఎక్కువ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గతంలో ధరణి విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నారు.. కొత్త ఆర్వోఆర్ చట్టం ఈ అసెంబ్లీ సెషన్స్‌లో తీసుకొస్తున్నారని చెప్పారు. ఈ లోపు ధరణి పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని నవీన్‌మిత్తల్‌ తెలిపారు.


జీరో స్టేజికి తీసుకురావాలి...

కాగా.. పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిశీలించి జీరో స్టేజికి తీసుకురావాలని ఆదేశించారు. దరఖాస్తులు వేగవంతంగా క్లియర్‌ చేసేందుకు ఎమ్మార్వోలకు అదనంగా లాగిన్‌లు ఇచ్చారు. రోజుకు వంద చొప్పున పెండింగ్‌ దరఖాస్తులు పరిశీలించాలని లక్ష్యం విధించారు. పరిష్కరించిన ప్రతి దరఖాస్తుకూ ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని.. తిరస్కరిస్తే, ఎందుకు రిజెక్ట్‌ చేశారో తెలుపుతూ రిమార్కులను నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఓపెన్‌ చేసేందుకు, వాటి పరిష్కారానికి అవసరమైన రిపోర్టులు అప్‌లోడ్‌ చేసేందుకు ప్రత్యేక లాగిన్‌లు ఇచ్చారు. ఇప్పటి వరకూ తహశీల్దార్లకు ఒకే లాగిన్‌ ఉండేది.


మరో లాగిన్‌ ఇవ్వాలని ఆదేశం...

ఆ లాగిన్‌ ద్వారానే ధరణి దరఖాస్తుల పరిశీలన, రిపోర్టుల అప్‌లోడ్‌, భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేవి. ఇప్పుడు వారికి అదనంగా మరో లాగిన్‌ ఇవ్వాలని కలెక్టర్లకు మిత్తల్‌ సూచించారు. ఒక లాగిన్‌ ద్వారా ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం, మరో లాగిన్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్లకు (డీటీ) ఇచ్చిన లాగిన్‌ ద్వారా ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ లాగిన్‌లు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఉండేది. ఆ బాధ్యతలను నుంచి వారిని తప్పించి అదనపు కలెక్టర్లకు అప్పగించారు.


ప్రత్యేక మాడ్యూల్‌..

ప్రతి సమస్య పరిష్కారానికీ ఒక ప్రత్యేక మాడ్యూల్‌ ఉందని.. వాటి ద్వారా అన్నీ పరిష్కరించాలని సూచించారు. పరిష్కారానికి వీలులేని దరఖాస్తులు ఉంటే కారణాలు చెప్పి రిజెక్ట్‌ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రూల్‌ పొజిషన్‌కు లోబడి పనిచేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని మాడ్యూల్స్‌లో వచ్చిన దరఖాస్తులకు మాత్రమే ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి.. మిగతా దరఖాస్తులను చెక్‌లిస్టులో ఉన్న సమాచారం ఆధారంగా అప్రూవ్‌ చేసేవారని అన్నారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి.. ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేసే విధానాన్ని తీసుకొచ్చినట్లు నవీన్‌మిత్తల్‌ వెల్లడించారు.

Updated Date - Nov 28 , 2024 | 06:37 PM