Sridhar Babu: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతున్నాం
ABN , Publish Date - Jul 23 , 2024 | 06:53 PM
రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడంలో కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని కోరారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం వెనక్కిపోదన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడంలో కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం వెనక్కిపోదని స్పష్టం చేశారు. జూలై 31తేదీ లోగా బడ్జెట్‌కు సంబంధించి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని నిర్ణయించినట్లు.. ఆ లోపు బిల్లును పెట్టకుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం స్పీకర్‌ని కోరిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావుకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నీ తెలుసునని అన్నారు. తిమ్మిని బమ్మిని చేయాలని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమయం ఉన్నా 8 రోజుల కన్నా ఎక్కువ రోజులు అసెంబ్లీని జరపలేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతున్నామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌దే తుది నిర్ణయమని చెప్పారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అంశాలపై స్పీకర్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
లా అండ్ ఆర్డర్ , రుణమాఫీ, స్థానిక సంస్థలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని చెప్పారు. రైతు సమస్యలంటూ బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. తెలంగాణ అవసరాల దృష్ట్యా ఎక్కువ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. తెలంగాణకు చట్ట ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించటంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నిధుల విషయంలో కేంద్రంపై పోరాటం చేస్తామని అన్నారు.
విభజన చట్టానికి సంబంధించి ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రతిపక్షం అడిగిన ప్రతి అంశంపై చర్చిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీని సీఎంచ రేవంత్‌రెడ్డి కలిస్తే బీజేపీకి దగ్గర అయినట్టు కాదని తేల్చిచెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసినట్టు బీజేపీ, కాంగ్రెస్ కలవదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.