Share News

Sudarshan Reddy: కరప్షన్ ,కలెక్షన్ కాంగ్రెస్ విధానం

ABN , Publish Date - Aug 13 , 2024 | 01:57 PM

కరప్షన్, కలెక్షన్ కాంగ్రెస్ విధానమని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. హరీష్‌రావు పని విధానాన్ని తప్పు పట్టే నైతిక అర్హతా పొన్నం ప్రభాకర్‌కు లేదని మండిపడ్డారు.

Sudarshan Reddy: కరప్షన్ ,కలెక్షన్ కాంగ్రెస్ విధానం
Sudarshan Reddy

హైదరాబాద్: కరప్షన్, కలెక్షన్ కాంగ్రెస్ విధానమని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. హరీష్‌రావు పని విధానాన్ని తప్పు పట్టే నైతిక అర్హతా పొన్నం ప్రభాకర్‌కు లేదని మండిపడ్డారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


రైతుల పక్షాన హరీష్‌రావు మాట్లాడితే పొన్నం సహా మంత్రులు పిచ్చి కూతలు కూస్తున్నారని విమర్శలు చేశారు. రూ.31 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ అన్నారని.. చివరకు రూ.18 వేల కోట్లతో మమ అనిపించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు చేశారు. రుణమాఫీపై బీఆర్ఎస్ పెట్టిన కాల్ సెంటర్‌కు ఇప్పటికే 75 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. పంద్రాగస్టున మూడో విడత రుణమాఫీ అంటున్నారని.. ఆ విడత తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి , మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగని పరిస్థితి ఉంటుందని తెలిపారు.


రైతు రుణమాఫీ కాని రైతుల పక్షాన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ కాని వారే ఇంకా లక్షల సంఖ్యలో ఉన్నారని చెప్పారు. రవాణా శాఖలో ప్రతి జిల్లాకు కోటి రూపాయలు అక్రమంగా వసూల్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖలో 1832 కలెక్షన్ సెంటర్లూ పెట్టి మిల్లర్ల ను వేధిస్తున్నారని విమర్శలు చేశారు. బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ. 75 లు వసూల్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రూ.50 వేల కోట్లు అప్పు చేసిందని సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు.


అవినీతికి పర్యాయపదం: ఎర్రోళ్ల శ్రీనివాస్

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రతి విషయాన్ని రాద్దాతం చేస్తారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. అవినీతికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలు ఓలెక్టా , జేబీఎం సంస్థలకు ధారాదత్తం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. కొన్ని డిపోలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. ఆర్టీసీలో కలెక్షన్ల దందా నడుస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో భారీగా అవినీతి జరిగిందని విమర్శలు చేశారు. ఈ విషయంపై సీబీసీఐడీ దర్యాప్తు చేయడానికి సిద్ధమా ? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ విసిరారు.

Updated Date - Aug 13 , 2024 | 01:57 PM