TG News: బాబోయ్ దొంగలు.. హైదరాబాద్‌లో వరుస చోరీలతో హడల్..
ABN , Publish Date - Jun 21 , 2024 | 07:05 PM
భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్లోని ఓ గోల్డ్ షాప్‌లో రాబరికి యత్నించారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్లోని ఓ గోల్డ్ షాప్‌లో రాబరికి యత్నించారు. వనస్థలిపురంలో బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తి దగ్గర రూ. 15లక్షల నగదు, బంగారాన్ని దొంగల ముఠా కాజేసింది. బ్యాంకు సీసీ కెమెరాలో ముఠా కదలికలు రికార్డు అయ్యాయి.
కారులో డబ్బుల బ్యాగు లాక్కొని బైక్‌పై ఇద్దరు దుండగులు పరారయ్యారు. మరో సంఘటన నిన్న మేడ్చల్‌లో పట్టపగలే గోల్డ్ షాపులో చొరబడి దోపిడీకి ఓ దొంగల ముఠా యత్నించింది. యజమానిపై కత్తితో దాడిచేసి బైక్‌పై ఇద్దరు దుండగులు పరారయ్యారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇప్పటి వరకు దోపిడీ ముఠాల ఆచూకీ దొరకలేదు. కాగా.. హయత్ నగర్‌లోని ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో ఆరు ఇళ్లలో వరుస చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
అలాగే పటాన్‌చెరు, రుద్రారంలో గల నివాసాల్లో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఉప్పల్ చిలుకా నగర్‌లో వృద్ధ దంపతులను బందించి ఓ ముఠా దోపిడీ యత్నం చేసింది. అయితే ఈ దొంగతనాలు ధార్ గ్యాంగ్ చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీలు జరిగిన ప్రదేశాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం క్లూస్ టీంతో పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా కాలనీల్లో ఎవరైనా సంచరిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న దోపీడిలు మాత్రం ఆగకపోవడంతో ప్రజలు హడలెత్తి పోతున్నారు. పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.