Uttam Kumar Reddy: తెలంగాణ ఆ రికార్డ్ సాధించింది.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 02 , 2024 | 09:05 PM
పది నెలల వ్యవధిలో 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రుణమాఫీలో తెలంగాణ రికార్డ్ సాధించిందని అన్నారు. 11 నెలల పాలనలో రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు.
సూర్యాపేట: తమ ప్రభుత్వంతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రుణమాఫీలో తెలంగాణ రికార్డ్ సాధించిందని అన్నారు. 11 నెలల పాలనలో రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి సాధిస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటి సారిగా సన్నాలకు బోనస్ ఇస్తున్నామన్నారు. పది నెలల వ్యవధిలో 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ఇవాళ(సోమవారం) మోతె మండల కేంద్రంలో రూ. 25 కోట్ల నిధులతో మోతె-మొద్దుల చెరువు రహదారి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ బస్సుల స్థానంలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
మొదటి విడతలో 1000 బస్సుల తయారీకి ఆదేశాలు ఇచ్చామని.. నగరానికి 250 బస్సులు చేరుకున్నాయని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే అధిక సాగు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు చేశారని తెలిపారు. రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. హాస్టల్ మెస్, డైట్ చార్జీలు పెంపు…ఏడాదిలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. ఏడాదిలో కోదాడకు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందించనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
సామాజిక భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉంది: మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్: విద్యా, వైద్యం సోషల్ సామాజిక భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 50 పడకల ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇవాళ(సోమవారం) సచివాలయం మీడియా పాయింట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పది నిమిషాల్లోనే అంబులెన్స్ సంఘటనా స్థలానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. బ్లాక్ స్పాట్స్ గుర్తింపు...అక్కడ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ప్రతీ 30 కిలో మీటర్లకు ఒక ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు..
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు ఎలా ఉన్నాయో.. అలా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసే యోచనలో సర్కార్ ఉందని తెలిపారు. రాబోయే 15 రోజుల్లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మందుల కొరత లేదు...మందుల కోసం ప్రతీ నెలా రూ.50 కోట్లు నిధులు ఇస్తున్నామని వివరించారు. కేంద్ర ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తెలంగాణలో ఇన్‌పేషెంట్‌లో బెడ్లను మరో 7వేలకు పెంచుతామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ‘‘నా క్లయింట్ - నా కస్టమర్’’ నినాదంతో ప్రభుత్వం పనిచేయబోతోందని తెలిపారు. ఫుడ్ సేఫ్టీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అన్నారు. ఇప్పటికే 6వేల చోట్ల తనిఖీలు చేపట్టామని.. రూ. 60 లక్షలు ఫైన్ వేశామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.