Share News

Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఆ విషయంలో వెనక్కి తగ్గని యాజమాన్యం..

ABN , Publish Date - Sep 30 , 2024 | 05:07 PM

ప్రయాణికులకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్ ఇచ్చింది. నాగోల్, మియాపూర్‌ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని ఎత్తేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది.

Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఆ విషయంలో వెనక్కి తగ్గని యాజమాన్యం..

హైదరాబాద్: ప్రయాణికులకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్ ఇచ్చింది. నాగోల్, మియాపూర్‌ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని ఎత్తేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6నుంచి నాగోల్, మియాపూర్‌ మెట్రో పార్కింగ్ వద్ద ఛార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే గతంలోనూ పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా.. ప్రయాణికుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 14నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడంతో పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. పలు రాజకీయ పార్టీలు సైతం ప్రయాణికులకు మద్దతు తెలిపాయి. నగరవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేయడం, మహా ధర్నాకు పిలుపునివ్వడంతో మెట్రో అధికారులు వెనక్కి తగ్గారు. తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మళ్లీ నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మరోసారి వారి నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పెద్దఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గత నిర్ణయం..

గతంలోనూ ఆగస్టు 14నుంచి మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు ఉదయం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసేందుకు వెళ్లిన ప్రయాణికులు బోర్డు చూసి అవాక్కయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరకొర జీతాలతో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేక నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉంటున్నామని, ఛార్జీలు కాకుండా అదనంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ మెట్రో కొత్త రూల్స్ తీసుకురావడం దారుణం అని మండిపడ్డారు.


ఛార్జీలు ఇలా..

ద్విచక్రవాహనాన్ని 2గంటలు పార్కింగ్ చేస్తే రూ.10, అలాగే 8గంటలపాటు చేస్తే రూ.25 చెల్లించాలి. 12గంటలపాటు పార్క్ చేయాల్సి వస్తే రూ.40కట్టాలి. ఓ కారు రెండు గంటలు పార్క్ చేస్తే రూ.30, 8గంటలపాటు అయితే రూ.75, 12గంటలపాటు పార్క్ చేస్తే రూ.120 చెల్లించాలి. అదనంగా ఒక్కో గంటకు మరో రూ.5చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 40శాతం డిస్కౌంట్‌తో నెలవారీ పాసులు ఇచ్చేందుకు సైతం మెట్రో అధికారులు సౌలభ్యం కల్పించారు. పోనీ ఇంత నగదు వసూలు చేసినప్పటికీ కూడా వాహనాల భద్రతకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. వాహనాలు దొంగతనాలకు గురైనా, దెబ్బతిన్నా, ఏవైనా వస్తువులు పోయినా తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అధికారులు బోర్డు పెట్టడంపైనా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు రోజుకు రూ.40 అంటే నెలకు రూ.1200 వందలు చెల్లించాలని, దీని వల్ల తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని వారు వాపోయారు. దీంతో వారంతా నిరసనలకు దిగారు. పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుండడంతో మెట్రో యాజమాన్యం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం మళ్లీ అదే విధానాన్ని తీసుకురావడంతో ఇప్పుడు ప్రయాణికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Konda Surekha: మంత్రి కొండా సురేఖ కంటతడి.. కేటీఆర్‌కు తీవ్ర హెచ్చరిక

Updated Date - Sep 30 , 2024 | 06:24 PM