Share News

Khammam : మంత్రి తుమ్మల కంటతడి

ABN , Publish Date - Aug 14 , 2024 | 04:53 AM

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు.. ఇప్పుడు రిబ్బన్‌ కట్‌ చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ఉవ్విళ్లూరుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు.

Khammam : మంత్రి తుమ్మల కంటతడి

  • హరీశ్‌ విమర్శలతో మనస్తాపం

  • ప్రజల కోసం పని చేస్తా.. పబ్లిసిటీ కోసం కాదు

  • ‘సీతారామ’ ప్రారంభానికి మీరూ రండి

  • ప్రజాస్వామ్యంలో నీది నాది ఏదీ లేదు.. అంతా ప్రజలదే

  • మీ తప్పిదాలను మాకు అంటగట్టొద్దు: తుమ్మల

  • సీతారామ.. 2026 ఆగస్టు 15కల్లా పూర్తి

  • బీఆర్‌ఎస్‌ హయాంలో 39% పనులే పూర్తయ్యాయి

  • రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్‌హౌ్‌సలు..

  • రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ప్రారంభం: మంత్రి ఉత్తమ్‌

  • ఖమ్మంతో పెట్టుకోవద్దు.. ఎంత తక్కువ గోక్కుంటే

  • అంత మంచిది: మంత్రి పొంగులేటి

ఖమ్మం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు.. ఇప్పుడు రిబ్బన్‌ కట్‌ చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ఉవ్విళ్లూరుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు. ప్రజాస్వామ్యంలో నీది.. నాది అంటూ ఏదీ ఉండదని, అంతా ప్రజల కష్టం, రక్తం, చెమటతో కట్టే పన్నులతోనే పనులు చేస్తాం తప్ప.. సొంత డబ్బుతో ఎవరూ పనిచేయరని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించే బాధ్యత అధికారంలో ఉండే ప్రభుత్వానికే ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇది తెలుసుకోకుండా హరీశ్‌రావు తనపై విమర్శలు చేయడం తగదన్నారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే మంత్రిగా ఉన్నానే తప్ప.. పబ్లిసిటీ కోసం పనిచేసేవాడిని కాదు. చీప్‌ పబ్లిసిటీలు నాకు అవసరం లేదు. ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించడమే నా లక్ష్యం’’ అని అన్నారు. ఈ నెల 15న జరిగే సీతారామ ఎత్తిపోతల స్విచ్చాన్‌ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వాళ్లు కూడా రావచ్చునని సూచించారు. ‘‘వైరా సభలో.. మీ ప్రభుత్వంలో మీరు సీతారామ ప్రాజెక్టును ఎలా వదిలేశారో చెప్పుకొనేందుకు అవకాశం కల్పిస్తాం’’ అని తుమ్మల వ్యాఖ్యానించారు.


8 వేల కోట్లు ఖర్చుపెట్టి అసంపూర్తిగా వదిలేశారు..

గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వకుండా అసంపూర్తిగా వదిలేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. కనీసం ఉన్న వనరులతోనైనా సాధ్యమైనంత వరకు నీరందించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఏన్కూరు లింక్‌ కెనాల్‌ ద్వారా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించి.. వైరా, లంకసాగర్‌ పరిధిలో లక్షా 25 వేల ఎకరాలకు ఈ ఏడాది నీరివ్వవచ్చని ఒప్పించానన్నారు.

ముఖ్యమంత్రి రూ.90 కోట్లు మంజూరు చేయడంతో రెండు నెలల్లో పనులు పూర్తిచేయించి, కాలువలు తవ్వించి నీళ్లు వదలబోతున్నామని చెప్పారు. ‘‘గత ప్రభుత్వ హ యాంలో మొదటి ఐదేళ్లలో సీతారామ ప్రాజెక్టు పనులు చేపట్టి.. అక్కడక్కడా కాలవలు తవ్వి.. మూడు పంపుహౌజ్‌లకు మోటార్లు పెట్టి వదిలేశారు.

ఆ తర్వాత ఐదేళ్లలో ఈ పనులను పట్టించుకోకుండా డిజైన్‌ మార్చి అస్తవ్యస్తం చేశారు. అయినా రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రజల సొమ్ము వృధా కాకూడదనే మేం సత్వరం ఎత్తిపోతలు పూర్తి చేయాలని భావించాం. ట్రయల్‌రన్‌ నిర్వహించకపోతే మోటార్లు పనిచేయవనే ఉద్దేశంతో వాటిని వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుంటే తప్పుడు విమర్శలు చేయడం హరీశ్‌రావుకు తగదు’’ అని తుమ్మల అన్నారు.


నేను స్విచాన్‌ చేయలేదు..

మొదటి పంపుహౌజ్‌కు తాను స్విచాన్‌ చేయలేదని, నీటిపారుదల శాఖ నిపుణుడు పెంటారెడ్డితో చేయించానని మంత్రి తుమ్మల తెలిపారు. ఒక మనిషిలా గోదావరి జలాలను తలపై చల్లుకున్నానని చెప్పారు. తన రాజకీయ జీవిత లక్ష్యం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలను అందించడమేనని, అంతేతప్ప.. ఫ్లెక్సీల కోసం, ప్రకటనల కోసం, స్వార్ధం కోసం ఏనాడూ ఏ పనీ చేయలేదన్నారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువకాలం మంత్రిగా పనిచేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రిగా.. అప్పటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎన్టీఆర్‌, వైఎ్‌సఆర్‌, చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు ఎక్కడైనా మిగిలిపోతే వాటిని పూర్తిచేశానే తప్ప.. గత ప్రభుత్వాలు చేశాయని వివక్ష చూపించలేదన్నారు.

ప్రజాభిమానం ఉంటేనే గద్దెపై ఉంటామన్న విషయం గుర్తుంచుకోవాలని, బీఆర్‌ఎస్‌ నేతల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ ఇంకా కనిపిస్తోందని అన్నారు. వారి పాలనలో తప్పిదాలను తమ ప్రభుత్వానికి అంటగట్టవద్దన్నారు. గతంలో ఇష్టానుసారంగా గురుకులాలు పెట్టి సమస్యలు గాలికి వదిలేశారని, ఈ ఆరు నెలల్లోనే తమ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నట్టుగా విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.

Updated Date - Aug 14 , 2024 | 04:53 AM