TG News: ఖమ్మంలో ఉధృతంగా మున్నేరు.. పలు కాలనీలు జలమయం
ABN , Publish Date - Sep 01 , 2024 | 03:29 PM
తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వానలు ఏకధాటిగా పడుతుండటంతో ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగుకు పై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
ఖమ్మం: తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వానలు ఏకధాటిగా పడుతుండటంతో ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగుకు పై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్-ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతాల్లోకి మున్నేరు వరద పోటెత్తింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండేవారు బయటకు రాలేకపోతున్నారు.
అక్కడున్న వారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రక్షణ కోసం ఎత్తుగా ఉన్న బిల్డింగుల్లోకి చేరుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు నరకయాతన పడుతున్నారు. కొంతమంది స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రకాశ్ నగర్ బ్రిడ్జివైపున ఏడుగురు వ్యక్తులు వరద నీటి ప్రవహంలో చిక్కుకుపోయారు. వారి కోసం కూడా అధికారులు రక్షణ బృందాలను పంపించారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
మున్నేరు నది పూర్తి నీటి సామర్థ్యం కన్నా ఎక్కువగా ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మున్నేరుపై ఉన్న వంతెనపై నుంచి భారీ వాహనాలు, బస్సుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
మధిరలో డిప్యూటీ సీఎం పర్యటన..
కాగా.. మధిరలో ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని భట్టివిక్రమార్క పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. చెరువులు కుంటలకువ ర్షపు నీరు భారీగా చేరడంతో వాగులు. చెరువులు పొంగుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. వర్షం ధాటికి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
కొత్తగూడెం విద్యానగర్ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం
కొత్తగూడెం విద్యానగర్ ప్రాంతంలో ఖమ్మం - కొత్తగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరింది. రహదారి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఇంకా కొనసాగుతునే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.